- వరుస ఘటనలతో పోలీసులు ఉక్కిరిబిక్కిరి
కరీంనగర్, వెలుగు: కరీంనగర్ టూటౌన్ పోలీస్ స్టేషన్ ఇటీవల సంచలన కేసులతో చర్చనీయాంశంగా మారింది. కేవలం పది రోజుల వ్యవధిలో భూకబ్జా, పీఎంజే జ్యువెలరీ దోపిడీ, ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీసుపై దాడి, కేంద్ర మంత్రి బండి సంజయ్ కొడుకు బండి భగీరథ్ ఇచ్చిన కంప్లయింట్‌తో నాలుగు కీలక కేసులు నమోదయ్యాయి.
దీంతో ఈ పోలీస్ స్టేషన్ అధికారులకు కంటి మీద కునుకు ఉండని పరిస్థితి నెలకొంది. ఈ నెల 2న నకిలీ పత్రాలతో కొత్తపల్లి మండలం చింతకుంట శివారులోని సర్వే నంబర్లు 212, 214లో ఖాళీ ప్లాట్లను అక్రమంగా రిజిస్ట్రేషన్ చేసి విక్రయించిన ముఠాపై కేసు నమోదైంది. ఈ కేసులో సీపీఐ మాజీ జిల్లా కార్యదర్శి మర్రి వెంకటస్వామితో పాటు ముగ్గురిని పోలీసులు అరెస్టు చేశారు.
కేసు దర్యాప్తు కొనసాగుతుండగానే మే 3న టూటౌన్ పరిధిలోని పీఎంజే జ్యువెలరీలో దోపిడీ జరిగింది. బిహార్‌కు చెందిన ఐదుగురు దొంగలు కిలోన్నర బంగారం దోచుకుని నలుగురిపై కాల్పులు జరిపారు. ఈ కేసు ఛేదించేందుకు 15 ప్రత్యేక బృందాలు బిహార్, బెంగాల్ రాష్ట్రాల్లో గాలిస్తున్నాయి. మే 7న ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి వ్యాఖ్యలపై బీజేపీ కార్పొరేటర్లు, కార్యకర్తలు కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల క్యాంప్ ఆఫీసుపై దాడి చేశారు.
గన్‌మెన్లు అప్రమత్తంగా వ్యవహరించడంతో పెద్ద ప్రమాదం తప్పింది. ఈ ఘటనపై కూడా కేసు నమోదైంది. మే 8న కేంద్ర మంత్రి బండి సంజయ్ కొడుకు బండి భగీరథ్ ఇచ్చిన ఫిర్యాదుతో మరో కేసు నమోదైంది. హైదరాబాద్‌కు చెందిన ఓ యువతి తల్లిదండ్రులు రూ.5 కోట్ల కోసం తనను బ్లాక్ మెయిల్ చేస్తున్నారని ఆయన ఫిర్యాదు చేశారు. ఈ కేసు మే 9న వెలుగులోకి వచ్చింది. ఇలా వరుస కేసులతో కరీంనగర్ టూటౌన్ పోలీస్ స్టేషన్ పోలీసులు ఉక్కిరిబిక్కిరవుతున్నారు.
