
- కరీంనగర్ సీపీ గౌస్ ఆలం
జమ్మికుంట/చొప్పదండి, వెలుగు: వినాయక నిమజ్జనాలను ప్రశాంతంగా జరపుకునేందుకు ఏర్పాట్లు చేయాలని కరీంనగర్ సీపీ గౌస్ ఆలం అధికారులకు సూచించారు. గురువారం జమ్మికుంట పట్టణంలోని నాయిని చెరువు, చొప్పదండి మండలకేంద్రంలోని నవోదయ స్కూల్ సమీపంలోని ఎస్పారెస్పీ కాలువ వద్ద నిమజ్జన ప్రదేశాలను పరిశీలించారు. ఈ సందర్భంగా సీపీ మాట్లాడుతూ నిమజ్జనం కోసం జేసీబీలు, క్రేన్లు, డోజర్లు, ఇతర ఏర్పాట్లను పకడ్బందీగా చేయాలన్నారు.
విద్యుత్, రెవెన్యూ, మున్సిపల్, హెల్త్ డిపార్ట్‌మెంట్ల అధికారులు సమన్వయంతో వ్యవహరించాలన్నారు. ఆయా కార్యక్రమాల్లో ఏసీపీ శ్రీనివాస్ జి, జమ్మికుంట మున్సిపల్ కమిషనర్ మహమ్మద్ అయాజ్, మాజీ మున్సిపల్ చైర్మెన్ రాజేశ్వర్‌రావు, చొప్పదండి మున్సిపల్ కమిషనర్ నాగరాజు, సీఐ ప్రదీప్ కుమార్, ఎస్‌ఐ నరేశ్‌రెడ్డి, ఇతర శాఖల అధికారులు
పాల్గొన్నారు.
గణేశ్ నిమజ్జనోత్సవానికి పకడ్బందీ చర్యలు
గోదావరిఖని, వెలుగు: గణేశ్ నిమజ్జనానికి రామగుండం కమిషనరేట్ పరిధిలో పకడ్బందీ చర్యలు చేపట్టామని, పూర్తిగా నిఘా నీడలో శోభాయాత్ర నిర్వహించాలని రామగుండం సీపీ అంబర్‌కిశోర్ ఝా తెలిపారు. గోదావరిఖనిలో నిమజ్జనం జరిగే గోదావరి బ్రిడ్జి ప్రాంతాన్ని మంచిర్యాల కలెక్టర్దీపక్కుమార్తో కలిసి గురువారం పరిశీలించారు. పెద్దపల్లి జోన్లో 2,524 విగ్రహాలు, మంచిర్యాల జోన్లో 2,334 విగ్రహాలు ఏర్పాటు చేయగా వాటిని 47 ప్రాంతాల్లో నిమజ్జనం చేయనున్నట్లు చెప్పారు.
గణేష్ నిమజ్జనం, శోభాయాత్ర సందర్భంగా పెద్దపల్లి, మంచిర్యాల జోన్ల పరిధిలో ఆరుగురు ఏసీపీలు, 19 మంది సీఐ, ఆర్ఐలు, 57 మంది ఎస్ఐ, ఆర్ఎస్ఐలు, ఇతర సిబ్బందితో బందోబస్త్ ఏర్పాటు చేసినట్టు సీపీ తెలిపారు. కాగా నది బ్రిడ్జి వద్ద నిమజ్జన ఏర్పాట్లను రామగుండం ఎమ్మెల్యే ఎంఎస్ రాజ్‌ఠాకూర్ పరిశీలించారు. 25 ప్లాట్‌ఫారాలను, 10 క్రేన్లను ఏర్పాటు చేశారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా, ఇబ్బందులు తలెత్తకుండా నిమజ్జనం కొనసాగించాలని ఎమ్మెల్యే సూచించారు.