
కరీంనగర్ సీపీ కమలాసన్ రెడ్డి జాగ్రత్తలు
కరీంనగర్ : పోలీసు, మహిళా శిశుసంక్షేమ శాఖ ఆధ్వర్యంలో లైంగిక నేరాల నియంత్రణపై కరీంనగర్ లో సమావేశం నిర్వహించారు. మహిళా సంఘాల నేతలు, అధికారులు పాల్గొన్న ఈ సమావేశానికి పోలీస్ కమిషనర్ కమలాసన్ రెడ్డి హాజరయ్యారు. కరీంనగర్ కమిషనరేట్ పరిధిలో మహిళలు, బాలికలపై జరిగే దాడుల నియంత్రణకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. కరీంనగర్ షీ టీం కార్యక్రమాలతో ఈవ్ టీజింగ్ పై ఉక్కుపాదం మోపామన్నారు. ఇప్పటి వరకు 1,501 మంది రోమియోలను గుర్తించి అదుపులోకి తీసుకున్నామన్నారు. ఈవ్ టీజింగ్ హాట్ స్పాట్స్ ను గుర్తించి అక్కడ రెగ్యులర్ గా షీ టీం పర్యవేక్షణ ఉండేలా చూస్తున్నామన్నారు కమలాసన్ రెడ్డి.
సమాజంలో అందరూ సహకరిస్తేనే మహిళలపై జరిగే దాడులను అరికట్టవచ్చని అన్నారు కరీంనగర్ సీపీ. మన చుట్టుపక్కల వారి గురించి, పరిసరాల గురించి అవగాహన కలిగి ఉండాలన్నారు. తల్లిదండ్రులిద్దరూ పనులకు వెళ్లినప్పుడు ఒంటరిగా ఉండే ఆడపిల్లల పట్ల అప్రమత్తంగా ఉండాలని చెప్పారు. చిన్నతనం నుంచే ఆడపిల్లలకు గుడ్ టచ్, బ్యాడ్ టచ్ పై తల్లి అవగాహన కల్పించాలన్నారు. ఎవరైనా వేధిస్తే.. అమ్మాయిలు ధైర్యంగా పోలీసులకు ఫిర్యాదు చేయాలని సూచించారు కమలాసన్ రెడ్డి.