కరీంనగర్ డెయిరీకి ప్రతిష్టాత్మక పురస్కారం.. సంగంపెల్లివాసి అంకతి రాధకు ఉమెన్ డెయిరీ ఫార్మర్ అవార్డ్

కరీంనగర్  డెయిరీకి ప్రతిష్టాత్మక పురస్కారం.. సంగంపెల్లివాసి అంకతి రాధకు ఉమెన్ డెయిరీ ఫార్మర్ అవార్డ్
  •     అవుట్ స్టాండింగ్ డెయిరీ ప్రొఫెషనల్ అవార్డ్​కు ఎంపిక
  •     సంగంపెల్లివాసి అంకతి రాధకు ఉమెన్ డెయిరీ ఫార్మర్ అవార్డ్ 

కరీంనగర్, వెలుగు: డెయిరీ రంగంలో కరీంనగర్  డెయిరీ చైర్మన్  చలిమెడ రాజేశ్వర్ రావు చేసిన సేవలకు గుర్తింపుగాను ఇండియన్  డెయిరీ అసోసియేషన్  సౌత్ జోన్  ఆయనకు ప్రతిష్టాత్మక అవుట్  స్టాండింగ్  డెయిరీ ప్రొఫెషనల్  అవార్డ్–2025 తెలంగాణను అందజేసింది. 

క్షీర విప్లవ పితామహుడు వర్గీస్  కురియన్  జన్మ స్థలమైన కేరళ రాష్ట్రం కోజికోడ్ లోని కాలికట్  ట్రేడ్  సెంటర్ లో ఈ నెల 8, 9,10 తేదీల్లో నిర్వహించిన సదరన్  డెయిరీ అండ్  ఫుడ్  కాంక్లేవ్–-2026లో ఏపీ వ్యవసాయ, పశుసంవర్ధక శాఖ మంత్రి కింజారపు అచ్చెన్నాయుడు, తమిళనాడు పశుసంవర్ధక శాఖ మంత్రి మనోతంగరాజు, పుదుచ్చేరి పశుసంవర్ధక శాఖ మంత్రి తిరు సి.డిజెకుమార్ సమక్షంలో కేరళ పశుసంవర్ధక, పాడిపరిశ్రమ శాఖ మంత్రి జె. చించురాణి అవార్డును డెయిరీ చైర్మన్ రాజేశ్వర్ రావుకు అందజేశారు. 

అలాగే ఐడీఏ తెలంగాణ చాప్టర్  పరిధిలో బెస్ట్  ఉమెన్  డెయిరీ ఫార్మర్  అవార్డ్ కు జగిత్యాల జిల్లా సంగంపెల్లి ఎంపీఐ పాల ఉత్పత్తిదారురాలైన అంకతి రాధ ఎంపికయ్యారు. ఆమెకు రూ.20 వేల చెక్కు, అవార్డు అందజేశారు. అవార్డుల వివరాలను కరీంనగర్  డెయిరీలో మంగళవారం నిర్వహించిన మీడియా సమావేశంలో రాజేశ్వర్ రావు వెల్లడించారు. 

ఈ  సందర్భంగా రాజేశ్వర్ రావు మాట్లాడుతూ కరీంనగర్  డెయిరీ  రోజుకు 12 వేల లీటర్ల పాలసేకరణను ప్రారంభించి, ప్రస్తుతం 2 లక్షల లీటర్ల పాలసేకరణకు ఎదిగిందని తెలిపారు. అలాగే పాల అమ్మకాలు రోజుకు 4 వేల లీటర్ల నుంచి 1.80 లక్షల లీటర్ల వరకు  పెరిగాయని చెప్పారు. డెయిరీ టర్నోవర్ ను రూ.7 కోట్ల నుంచి రూ.450 కోట్లకు పెంచి పాడి రైతుల ఆదాయాన్ని పెంచుతూ, వినియోగదారులకు స్వచ్ఛమైన, రుచికరమైన, నాణ్యమైన పాలు, పాలపదార్థాలు అందిస్తున్నట్లు తెలిపారు. డెయిరీ ఎండీ పి.శంకర్ రెడ్డి, మేనేజర్  రాజశేఖర్ రెడ్డి పాల్గొన్నారు.