కరీంనగర్లో వంద శాతం వ్యాక్సినేషన్ పూర్తి

కరీంనగర్లో వంద శాతం వ్యాక్సినేషన్ పూర్తి

తెలంగాణలో కోవిడ్ వ్యాక్సినేషన్ ప్రక్రియ విజయవంతంగా కొనసాగుతోంది. 100 శాతం రెండో డోస్ కరోనా వ్యాక్సినేషన్ పూర్తిచేసిన జిల్లాగా కరీంనగర్ నిలిచింది. దీంతో ఈ గ్రేట్ అచీవ్మెంట్ సాధించిన వివిధ డిపార్ట్మెంట్ల ఉద్యోగులకు కరీంనగర్ కలెక్టరేట్ ఆడిటోరియంలో అభినందన సభ ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మంత్రి గంగుల కమలాకర్ హాజరయ్యారు. వ్యాక్సినేషన్ ప్రక్రియలో దక్షిణ భారతదేశంలో బెంగళూరు అర్బన్ మొదటి స్థానంలో ఉంటే... కరీంనగర్ 2వ స్థానంలో ఉందన్నారు. ఇక దేశంలో నాలుగో స్థానంలో కరీంనగర్ జిల్లా నిలిచిందన్నారు. కోవిడ్ రెండవ డోస్ వంద శాతం పూర్తి కావడం ఆనందంగా ఉందన్నారు. తెలంగాణ ఆరోగ్య వంతమైన రాష్ట్రంగా ఉండాలనేది ముఖ్యమంత్రి సంకల్పమన్నారు గంగుల. ప్రజల ఆరోగ్యం కాపాడడమే గొప్ప కార్యమన్నారు. ఇందుకోసం ఎన్ని వందల కోట్లైనా ఖర్చు పెట్టేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు మంత్రి. జిల్లాలో 104 శాతం మొదటి డోస్, 100.2 శాతం 2వ డోస్ పంపిణీ ప్రక్రియ పూర్తైందని తెలిపారు మంత్రి గంగుల కమలాకర్.

ఈ మహాయజ్ఞంలో భాగస్వాములైన ప్రతి ఒక్కరికి శిరస్సు వంచి నమస్కరిస్తున్నామన్నారు. 2020లో ముంబైలో ఒక్క కేసు నమోదైన సమయంలో... ఇక్కడ కరీంనగర్ లో 10 కేసులు నమోదు కావడం అల్లకల్లోలాన్ని సృష్టించిందన్నారు. ఆ రోజు అప్రమత్తమై మేము తీసుకున్న చర్యలు ఇప్పుడు కరీంనగర్ ను ఆదర్శంగా నిలిపాయన్నారు. క్వారెంటైన్ అనే పదాన్ని దేశానికి పరిచయం చేసి కఠిన చర్యలు తీసుకున్నామన్నారు. వ్యాక్సినేషన్ ప్రక్రియ విజయవంతంగా పూర్తి కావడంతో థర్డ్ వేవ్ ప్రాణాంతకంగా మారలేదన్నారు. 

సెకండ్ వేవ్ లో తీసుకున్న చర్యలతో ఎన్నో విలువైన ప్రాణాలు కాపాడామన్నారు. ఏ దేశం చేసిన తప్పో... మనం శిక్ష అనుభవించామన్నారు. తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న చర్యలతో... ప్రభుత్వం అండగా ఉందని ప్రజలకు నమ్మకమొచ్చిందన్నారు. ఇది కేసీఆర్ పాలనకు నిదర్శనమన్నారు. వ్యాక్సినేషన్ విజయవంతంగా పూర్తి చేయడాన్ని అభినందిస్తూ లక్ష రూపాయల నగదు పురస్కారాన్ని జిల్లాలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు అందజేస్తామన్నారు. ఇది మీరు చేసిన సేవలకు మేము ఇచ్చే చిన్న గుర్తింపు అన్నారు మంత్రి గంగుల.  నాడు కరోనా అంటే కరీంనగర్ భయపడితే... ఇప్పుడు కరీంనగర్ అంటే కరోనా భయపడే రోజులు వచ్చాయన్నారు. ప్రభుత్వా ఆసుపత్రులకు వెళ్ళాలంటే భయపడే రోజులు పోయాయన్నారు. ప్రాణాలు కాపాడుతామనే భరోసాన్ని ప్రజలకు కల్పించామన్నారు.  

ఇవి కూడా చదవండి: 

స్వీట్లు పంచుకున్న భారత్, పాక్ జవాన్లు

మంత్రి శ్రీనివాస్ గౌడ్ కు బిగుస్తున్న ఉచ్చు