- గతంలో పలుమార్లు ఇళ్లను ఆక్రమించుకునేందుకు జనం యత్నం
- లబ్ధిదారుల ఎంపికపై ఉత్కంఠ
కరీంనగర్, వెలుగు: కరీంనగర్ జిల్లాలో ఇల్లు, సొంత జాగ లేని నిరుపేదలకు పంపిణీ చేసేందుకు డబుల్ బెడ్ రూమ్ ఇళ్లను అధికారులు సిద్ధం చేస్తున్నారు. గత ప్రభుత్వం హయాంలో చేపట్టిన డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల నిర్మాణం కొన్నిచోట్ల పూర్తవ్వగా, మరికొన్ని చోట్ల అసంపూర్తిగా మధ్యలోనే ఆగిపోయిన విషయం తెలిసిందే, డబుల్ బెడ్రూం ఇళ్లలో అసంపూర్తిగా ఉన్న పనులను పూర్తి చేసి... నివాసయోగ్యంగా మారుస్తున్నారు. ఉమ్మడి జిల్లావ్యాప్తంగా 2,511 ఇళ్లు ప్రస్తుతం పంపిణీకి సిద్ధంగా ఉన్నాయి. ఈ నెలాఖరులోగా లబ్ధిదారులను ఎంపిక చేసేందుకు మున్సిపల్, హౌసింగ్ శాఖ అధికారులు కసరత్తు చేస్తున్నారు.
డబుల్ బెడ్ రూమ్ ఇళ్లకు రిపేర్లు..
బీఆర్ఎస్ సర్కార్ హయాంలో కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ నియోజకవర్గానికి అత్యధికంగా 3 వేల డబుల్ బెడ్రూం ఇండ్లు మంజూరు కాగా 1,214 నిర్మాణ పనులు ప్రారంభించారు. కరీంనగర్ నియోజకవర్గానికి 867 ఇళ్లకు 867, చొప్పదండికి 373 మంజూరు కాగా 257, మానకొండూరుకు 340 ఇండ్లకు గానూ 173 ఇండ్ల నిర్మాణం చేపట్టారు. ఇవి కూడా 70 నుంచి 80 శాతం పూర్తయింది. డోర్లు, కిటికీలు, ఫ్లోరింగ్, ఎలక్ట్రిసిటీ పనులు పెండింగ్‌లో ఉన్నాయి. కరీంనగర్‌లో జీ ప్లస్ ఫైవ్ పద్ధతిలో 600, హుజూరాబాద్‌లో జీ ప్లస్ 2 పద్ధతిలో 500 ఇండ్లను నిర్మించారు.
నాలుగైదేళ్ల క్రితమే వీటిని నిర్మించి వదిలేయడంతో అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా మారాయి. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక జాగ ఉన్న పేదలకు ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేస్తూనే సొంతిల్లు, జాగ లేని పేదలకు డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు ఇచ్చేందుకు దృష్టి సారించింది. ఇందులో భాగంగా పంపిణీకి వీలుగా మరమ్మతులు చేపట్టారు.
ఆక్రమణలకు యత్నం..
కరీంనగర్ జిల్లాలో చొప్పదండిలో మినహా ఎక్కడా లబ్ధిదారుల ఎంపిక చేయలేదు. దీంతో ఏళ్ల తరబడి ఇళ్ల కోసం చూసిన పేదలు ఎన్నికల ముందు పలుమార్లు కరీంనగర్ చింతకుంట, తీగలగుట్టపల్లిలోని డబుల్ బెడ్ రూమ్ ఇళ్లను ఆక్రమించే యత్నం చేశారు. ఇటీవల జమ్మికుంట మున్సిపల్ పరిధి ధర్మారంలో నిర్మించిన డబుల్ బెడ్ రూమ్ ఇళ్లను అదే గ్రామానికి చెందిన పేదలు ఆక్రమించారు. అలాగే హుజూరాబాద్ మండలం రంగాపూర్ శివారులో నిర్మించిన ఇళ్లను ముందుగా రంగాపూర్ నిరుపేదలకు కేటాయించాక మిగిలితేనే ఇతరులకు కేటాయించాలని డిమాండ్ చేస్తున్నారు.
లబ్ధిదారుల ఎంపికపై ఉత్కంఠ
ప్రజాపాలన సభల్లో సొంత ఇల్లు లేని పేదలు ఇందిరమ్మ ఇళ్ల కోసం దరఖాస్తు చేసుకున్నారు. వీరిలో ఇప్పటికే సొంత స్థలం ఉన్నవారిని ఎల్ 1 కేటగిరీలో చేర్చి ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేస్తున్నారు. సొంత జాగ లేని వాళ్లను ఎల్ 2 కేటగిరీలో చేర్చారు. ఇందులో నుంచే డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల లబ్ధిదారులను ఎంపిక చేయాల్సి ఉంది. అయితే అధికారులు ఎవరిని ఎంపిక చేస్తారనే విషయంలో ఉత్కంఠ నెలకొంది. గతంలో మాదిరిగా లాటరీ పద్ధతిలోనే లబ్ధిదారుల ఎంపిక జరుగుతుందని హౌసింగ్ శాఖ అధికారులు వెల్లడించారు.
