అద్దె ఇంట్లోకి డెడ్​బాడీని రానివ్వలె..

అద్దె ఇంట్లోకి డెడ్​బాడీని రానివ్వలె..
  • అనారోగ్యంతో మహిళా డాక్టర్​ చనిపోతే కనికరం చూపని ఇంటి ఓనర్​
  • కర్మకాండలకు ఇంటిని ఇచ్చి మానవత్వం చాటిన లాయర్​

నందిపేట,వెలుగు: అద్దె ఇంట్లో ఉంటూ అనారోగ్యంతో ఓ మహిళ చనిపోతే మానవత్వం మరిచిన ఆ ఇంటి ఓనర్​ ఆమె డెడ్​బాడీని ఇంట్లోకి రానివ్వకుండా అడ్డుకున్నాడు. కరీంనగర్​ జిల్లాకు చెందిన శబరి(60)  తన కుటుంబంతో కలిసి పదేండ్ల కింద నిజామాబాద్​ జిల్లా నందిపేటకు వచ్చారు. మండల కేంద్రంలోని సిద్ధి వినాయక హాస్పిటల్లో వైద్యసేవలు అందిస్తున్నారు. ఆమె భర్త ఐదేండ్ల కింద అనారోగ్యంతో చనిపోగా కొడుకుతో కలిసి మండల కేంద్రంలోని  రాంనగర్​లోని  ఓ ఇంట్లో రెంట్​కు ఉంటోంది. కొద్దిరోజుల నుంచి క్యాన్సర్​తో బాధపడుతూ ఆదివారం రాత్రి హాస్పిటల్​లో చనిపోయింది.

అంత్యక్రియలు నిర్వహించేందుకు డెడ్​బాడీని ఆమె కొడుకు అద్దె ఇంటికి తీసుకొస్తే సదరు ఇంటి ఓనర్​ అందుకు అంగీకరించలేదు. డెడ్​బాడీని ఇంట్లోకి తీసుకురావొద్దని కరాఖండిగా చెప్పేశాడు. సొంత ఊరిలో అన్నీ వదిలేసి ఇక్కడికే వచ్చామని, ఇంటిలోకి  రానివ్వాలని శబరి కుటుంబసభ్యులు వేడుకున్నారు. చివరికి ఇరుగుపొరుగు వారితో చెప్పించినా ఇంటి ఓనర్​ మనసు కరగలేదు. ఇది గమనించి అదే కాలనీలో ఉంటున్న పెద్దోళ్ల దేవన్న అనే లాయర్​ కర్మకాండ ముగిసేంత వరకు తన ఇంటిని వాడుకునేందుకు అవకాశం ఇచ్చి మానవత్వాన్ని చాటుకున్నాడు. దీంతో శబరి కుటుంబసభ్యులు సోమవారం దహన సంస్కారాలు నిర్వహించారు.