- దోపిడీ చేసిన రోజే ధర్మపురి పుష్కర ఘాట్ లో బైక్ వదిలేసిన దొంగలు
- బైక్ కు హైదరాబాద్ కు చెందిన కారు నంబర్ ప్లేట్
- గోదావరి దాటి మహారాష్ట్రలోకి ఎంట్రీ
- దొంగల్లో ముగ్గురు బిహార్ వాసులు షాబుద్దీన్, ఆనంద్, ఇంతియాజ్ గా గుర్తింపు
- రెండు రోజులు దాటినా దొరకని దొంగల జాడ
కరీంనగర్/జగిత్యాల, వెలుగు:కరీంనగర్ పీఎంజే జ్యువెలరీలో దోపిడీకి జగిత్యాల జిల్లా ధర్మపురిలోని ఓ లాడ్జీలోనే ప్లాన్ చేసినట్లు తెలిసింది. ఈ ముఠా ఈ నెల 1న కరీంనగర్ కు చేరుకుని పీఎంజే షాపు పరిసరాలను, అక్కడి పరిస్థితిని పరిశీలించినట్టు తెలుస్తోంది. అదేరోజు శాతవాహన యూనివర్సిటీ దగ్గర దొంగలు చాయ్ తాగినట్లు సీసీ కెమెరాల్లో రికార్డయినట్టు సమాచారం. దోపిడీ ఎలా చేయాలి ? ఎలా ఎస్కేప్ కావాలి? అని రెండు రోజులు స్కెచ్ వేసుకున్నాకే ఈ నెల 3న తెల్లవారుజామునే ధర్మపురి నుంచి బయల్దేరి కరీంనగర్ కు చేరుకున్నారని, దోపిడీ తర్వాత వచ్చిన దారిలోనే మధ్యాహ్నం ఒంటి గంట వరకు ధర్మపురికి వెళ్లినట్లు తెలిసింది. తాము వాడిన బైక్ ను ధర్మపురి గోదావరి పుష్కర ఘాట్ లో వదిలేసినట్టు తెలిసింది.
బైక్ కు కార్ నంబర్ ప్లేట్..
ధర్మపురి పుష్కర ఘాట్ సమీపంలో మంగళవారం ఉదయం దొంగలు వదిలేసిన టీఎస్ 09 ఎఫ్ జీ 6876 నంబర్ పల్సర్ బైక్ దొరికింది. ఈ నంబర్ హైదరాబాద్ కు చెందిన బెలెనో కారు నంబర్ గా ఆర్టీఏ రికార్డ్ లో ఉంది. చాసిస్, ఇంజన్ నంబర్లను పరిశీలించగా బైక్ ఢిల్లీకి చెందినదిగా పోలీసులు గుర్తించారు. ఈ బైక్ దొంగలు వాడిందేనని పోలీసులు భావిస్తున్నారు. చాసిస్ నంబర్ ఆధారంగా బైక్ రిజిస్ట్రేషన్ వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. మరో బైకును జగిత్యాల జిల్లా బీర్పూర్ అటవీ ప్రాంతంలో వదిలేశారని ప్రచారం జరుగుతోంది.
మధ్యాహ్నం ఒంటి గంటకు ధర్మపురికి చేరిన దొంగలు..
ఆదివారం ఉదయం 11.12 గంటలకు కరీంనగర్ లోని నగల షోరూంలో దోపిడీకి పాల్పడిన ముఠా 11.35 గంటలకు రామడుగు మండలం మోతె రుద్రారం మీదుగా వెళ్లినట్లు సీసీ కెమెరాల్లో రికార్డయింది. ఆ తర్వాత ఈ గ్యాంగ్ జగిత్యాల జిల్లా పెగడపల్లి కెనాల్ సమీపంలో 12.13 గంటల సమయంలో వెళ్తూ సీసీ కెమెరాల్లో కనిపించింది. ఘటన జరిగిన గంటలో 40 కిలోమీటర్ల దూరంలోని పెగడపల్లికి చేరుకోగా.. మధ్యాహ్నం ఒంటి గంట నుంచి 1.30 గంటల మధ్య ధర్మపురికి చేరుకొని ఉంటారని తెలుస్తోంది.
ఆ సమయంలో ధర్మపురి వీధుల్లోని సీసీ కెమెరాలను పోలీసులు నిశితంగా పరిశీలిస్తున్నారు. అప్పటికే దోపిడీ న్యూస్ వైరల్ కావడంతో ధర్మపురిలో ఆగే పరిస్థితి ఉండకపోవచ్చని బైక్ లను ధర్మపురిలో వదిలేసి మరో ఫోర్ వీలర్ లో రాయికల్ మండలం బోర్నపల్లి బ్రిడ్జి మీదుగా గానీ, సారంగాపూర్ మండలం కమ్మునూర్ వద్ద గోదావరి బ్రిడ్జి దాటి గానీ వెళ్లి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు.
దొంగల్లో ముగ్గురి గుర్తింపు..
దోపిడీకి పాల్పడిన దొంగల్లో ముగ్గురిని పోలీసులు ఇప్పటికే డేటాబేస్ ఆధారంగా గుర్తించినట్లు తెలిసింది. వీరిని షాబుద్దీన్, ఆనంద్, ఇంతియాజ్ గా గుర్తించగా.. మరో ఇద్దరి వివరాలు క్రిమినల్స్ డేటా బేస్ లో దొరకలేదు. ముగ్గురు కూడా బిహార్ కు చెందినవారని, మహారాష్ట్రలో షెల్టర్ తీసుకుంటూ దోపిడీలు చేస్తున్నారని సమాచారం. వీరి కోసం ప్రత్యేక బృందాలు మహారాష్ట్ర, బిహార్ వెళ్లినట్టు తెలిసింది.
అపాచీ బైక్ నడిపింది స్థానికుడే?
దొంగల ముఠాలోని ఐదుగురిలో ఒక స్థానికుడు ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. సీసీ కెమెరాల్లో లభించిన పుటేజీ ప్రకారం అన్నీ చోట్ల ఇద్దరు కూర్చున్న అపాచీ బైక్ ముందు వెళ్తుండగా.. ముగ్గురితో ఉన్న పల్సర్ బైక్ వారిని అనుసరించింది. అపాచీ బైక్ నడిపింది ఈ ప్రాంతం, పరిసరాలు పూర్తిగా తెలిసిన వ్యక్తే కావచ్చని భావిస్తున్నారు. జ్యువెలరీ షాపులో దొంగల్లో ఒకరు తెలుగు మాట్లాడినట్లు సిబ్బంది చెప్పడం బట్టి కూడా అతడు ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు చెందినవాడే కావచ్చుననే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
