
కరీంనగర్ జిల్లా సీపీఐలో వర్గ విభేదాలు బయటపడ్డాయి. జిల్లా సీపీఐ కార్యవర్గాన్ని రద్దు చేస్తున్నట్టు పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు చాడ వెంకటరెడ్డి ఇవాళ ప్రకటించారు. ఈ సమావేశంలో చాడతో పాటు… కరీంనగర్ జిల్లా కార్యదర్శి రాంగోపాల్ రెడ్డి కూడా పాల్గొన్నారు. కరీంనగర్ జిల్లా కార్యవర్గ నిర్మాణంలో కొన్ని లోపాలున్నాయని పార్టీ కమిటీ సూచించడంతో కరీంనగర్ జిల్లా పార్టీ కార్యవర్గాన్ని రద్దు చేస్తున్నట్టు చాడ వెంకటరెడ్డి తెలిపారు. కరీంనగర్ కన్వీనర్ గా శ్రీనివాస్ ను నియమించారు. సెప్టెంబరు మొదటి వారంలో జిల్లా పార్టీ నిర్మాణ మహాసభ ఏర్పాటు చేసి కొత్త కార్యవర్గాన్ని ఏర్పాటు చేస్తామన్నారు. తొలిసారిగా జిల్లా కార్యవర్గాన్ని రద్దు చేయాల్సి రావడం పట్ల విచారం వ్యక్తం చేశారు. వచ్చే మున్సిపల్ ఎన్నికల్లో తమకు బలమున్న వార్డుల్లో పోటీ చేస్తామని చాడ చెప్పారు.
ఐతే.. ఈ సమావేశం తర్వాత… కొద్దిసేపటికే సీపీఐ కరీంనగర్ జిల్లా కార్యదర్శి పదవికి రాం గోపాల్ రెడ్డి రాజీనామా చేశారు. పార్టీకి నష్టం కలిగించే వారు సీపీఐలో ఎక్కువయ్యారంటూ ఆయన ఆవేదనగా చెప్పారు.