ఫాంహౌస్ లో కుక్క చనిపోతే హంగామా..ప్రజల్ని పట్టించుకోరా

ఫాంహౌస్ లో కుక్క చనిపోతే హంగామా..ప్రజల్ని పట్టించుకోరా

న్యూఢిల్లీ, వెలుగు: ఆర్టీసీ కార్మికుడు బాబు అంత్యక్రియల్లో పోలీసులు తనపై చేసిన దాడిని ప్రజలపై జరిగిన దాడిగానే భావిస్తున్నానని కరీంగనర్ ఎంపీ బండి సంజయ్ అన్నారు. కరీంనగర్​ పోలీసుల తీరుపై విచారణ జరిపించాలని ఎంపీ సంజయ్ మంగళవారం జాతీయ మానవ హక్కుల కమిషన్(ఎన్ హెచ్ఆర్సీ)కి ఫిర్యాదు చేశారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, హోం సెక్రటరీ, డీజీపీ, కరీంనగర్ ఇన్​చార్జ్ సీపీ, ఇన్​చార్జ్ అడిషనల్ డీఎస్పీ, ఇన్​చార్జ్ డీఎస్పీలపై విచారణకు ఆదేశించాలని ఎన్ హెచ్ఆర్సీ సభ్యురాలు జ్యోతికా కార్లకు అందించిన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఆ తర్వాత ఎమ్మెల్సీ రాంచంద్రరావుతో కలిసి ఎంపీ సంజయ్ తెలంగాణ భవన్ లో మీడియాతో మాట్లాడారు. ఆర్టీసీ డ్రైవర్ బాబు అంతిమ యాత్రలో సీఎం డైరెక్షన్ లోనే తనపై దాడి జరిగిందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం, అధికారులు స్పందించకపోవడం వల్లే ఎన్ హెచ్ఆర్సీని ఆశ్రయించానన్నారు.

రాష్ట్రంలో రాక్షస పాలన

రాష్ట్రంలో రాక్షస పాలన కొనసాగుతుందని ఎంపీ సంజయ్​ మండిపడ్డారు. ప్రభుత్వ నిర్ణయాలు, విధానాలతో రెవెన్యూ వ్యవస్థపై ప్రజల్లో నమ్మకం సన్నగిల్లిందని, తహసిల్దార్ విజయారెడ్డి హత్య ఇందుకు నిదర్శనమన్నారు. కొండగట్టు బస్సు ప్రమాదం, ఇంటర్ విద్యార్థుల ఆత్మహత్యలు, ఆర్టీసీ కార్మికుల మరణాలపై స్పందించని కేసీఆర్, తన ఫాంహౌస్ లో కుక్క చనిపోతే మాత్రం రియాక్ట్ అయ్యారని, ప్రస్తుతం రాష్ట్రంలో ప్రజల బతుకులు కుక్కలకన్నా హీనంగా తయారయ్యాయన్నారు. రెవెన్యూ అధికారులు, రైతులు, కార్మికులు, పోలీసుల మధ్య విద్వేషాలను రెచ్చగొట్టి కేసీఆర్ పబ్బం గడుపుకుంటున్నారని విమర్శించారు. రాష్ట్రంలో విద్యార్థులు, కార్మికుల ఆత్మహత్యలను సీఎం కేసీఆర్ చేసిన హత్యలుగా భావిస్తున్నామన్నారు. రాష్ట్రంలో హక్కుల కోసం కేసీఆర్ కు వ్యతిరేకంగా మలిదశ ఉద్యమం ప్రారంభమైందని చెప్పారు. ప్రైవేటు సంస్థలతో కుదిరిన రహస్య అగ్రిమెంట్లలోని అంశాలు బయటకు వస్తాయనే, ఆర్టీసీ సమ్మె విషయంలో సీఎం వెనక్కి తగ్గడం లేదన్నారు. రాష్ట్రంలో జంగిల్ రాజ్ నడుస్తోందని రాంచందర్ రావు విమర్శించారు. సీఎం మెప్పు కోసం కొంతమంది పోలీసు అధికారులు టీఆర్ఎస్ కార్యకర్తలుగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. ఎంపీ సంజయ్ పై దాడికి పాల్పడిన వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

ప్రహ్లాద్ ​జోషికి కంప్లయింట్

తనపై పోలీసుల దాడిని ఎంపీ సంజయ్ పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి ప్రహ్లాద్ జోషి దృష్టికి తీసుకెళ్లారు. ఆ సమయంలో జరిగిన పరిస్థితులను మంత్రికి వివరించానన్నారు. పోలీసులు దాడి చేసిన చిత్రాలను ఆయనకు చూపించారు. స్పందించిన మంత్రి.. సభా చట్టాలను అనుసరించి న్యాయం చేస్తామని హామీ ఇచ్చారని సంజయ్​ చెప్పారు. బుధవారం లోక్ సభ స్పీకర్ ఓం బిర్లాకు ఫిర్యాదు చేయనున్నట్లు సంజయ్ చెప్పారు. తనపై జరిగిన దాడిని ఆయనకు వివరించి, సభా హక్కుల ఉల్లంఘన నోటీసు ప్రవేశపెట్టనున్నట్లు తెలిపారు.