కేసీఆర్​ ఎట్లున్నడు?..ఎందుకు బయటకొస్తలేడు? : బండి సంజయ్

కేసీఆర్​ ఎట్లున్నడు?..ఎందుకు బయటకొస్తలేడు? : బండి సంజయ్
  • ప్రత్యర్థినైన నాకున్న బాధ కూడా ఆయన కొడుక్కు ఉండొద్దా?
  • దీనిపై ప్రజల్లో అనుమానాలున్నయ్​
  • ఎన్నికల్లో గెలుపు కోసం బీఆర్​ఎస్​ కుట్రలు చేస్తున్నది
  • తొత్తులుగా మారిన ఆఫీసర్లకు కీలక పోస్టులు ఇస్తున్నది
  • ఆ పార్టీకి మైండ్​ బ్లాంక్​ అయ్యే తీర్పును ప్రజలిస్తరని కామెంట్​

కరీంనగర్, వెలుగు : సీఎం కేసీఆర్​ కొన్నిరోజులుగా బయటకు రాకపోవడంపై ప్రజల్లో అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ బండి సంజయ్ అన్నారు. ప్రత్యర్థినైనప్పటికీ కేసీఆర్​ బాగుండాలని కోరుకునే వాళ్లలో తాను ముందుంటానని, తనకున్న బాధ కూడా కొడుకైన కేటీఆర్​కు లేదని మండిపడ్డారు. కేసీఆర్​కు ఏమైందో, ఎట్లున్నడో ప్రజలకు చెప్పాలని, ఆయనకు రక్షణ కల్పించాలని డిమాండ్​ చేశారు. కేసీఆర్​ కష్టాల్లో ఉన్నందుకే ఆయన భార్య తిరుమల వెళ్లి తలనీలాలు సమర్పించుకొని వచ్చారని, తండ్రి కోసం కేటీఆర్​ ఎందుకు తలనీలాలు సమర్పించడం లేదని ప్రశ్నించారు.

కరీంనగర్​లోని తన ఆఫీసులో బుధవారం బండి సంజయ్​ మీడియాతో మాట్లాడారు.  ‘‘కేసీఆర్​ ఏడికి పోయిండు. ఆయనకు రక్షణ కల్పించాలి. కేసీఆర్​కు బాగుండాలని ఆయన భార్య వెంకటేశ్వరస్వామి దగ్గరకు వెళ్లి తలనీలాలు సమర్పించుకొని వచ్చారు. కేసీఆర్​ ఎంత కష్టాల్లో ఉంటే ఆమె తలనీలాలు సమర్పించుకొని వస్తరు? కేటీఆర్​ కూడా పోయి తలనీలాలు ఇవ్వొచ్చు కదా? ఇంత ప్రత్యర్థినైన నేను కూడా కేసీఆర్​ మంచిగుండాలని కోరుకుంటున్న. నాకున్న బాధ కేటీఆర్​కు లేదు. కొడుక్కేం బుట్టింది. నాస్తికుడా? దేవుడ్ని ఎందుకు మొక్కుతలేడు? తలనీలాలు ఇవ్వొచ్చు కదా.. ఇస్తే ఏమైతది..

గ్లామర్​ దెబ్బతింటదా? తండ్రికంటే ఎక్కువనా నీ గ్లామర్​” అని మండిపడ్డారు. కేసీఆర్​కు, ఆయన కుటుంబానికి వెంకటేశ్వరస్వామి ఆశీస్సులు ఉండాలని తాను కూడా కోరుకుంటానని చెప్పారు. ‘‘కేసీఆర్​ బాగుండాలని బిడ్డ ఓ దిక్కు.. తల్లి ఓ దిక్కు పూజలు చేస్తున్నరు.. కొడుకు మాత్రం చేస్తలేడు. కేసీఆర్​ మీద నాకు ప్రేమెక్కువ. ఆయన ఎందుకు బయటకు వస్తలేడు.. దీనిపై తెలంగాణ సమాజంలో ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నయ్​. ఇది నా మాట కాదు. ప్రజలే చర్చించుకుంటున్నరు” అని సంజయ్​ అన్నారు. 

ఇంటెలిజెన్స్​ ఆఫీసర్లను ఎందుకు బదిలీ చేస్తలే

అసెంబ్లీ ఎన్నికల్లో ఎట్లయినా గెలవాలని బీఆర్ఎస్ ప్రభుత్వం కుట్రలు చేస్తున్నదని, తొత్తులుగా పనిచేస్తున్న ఆఫీసర్లకు కీలకమైన పోస్టింగ్స్ ఇచ్చిందని  బండి సంజయ్  మండిపడ్డారు. అన్ని శాఖల అధికారులను బదిలీ చేసిన ప్రభుత్వం ఇంటెలిజెన్స్ అధికారులను ఎందుకు బదిలీ చేయడం లేదని ప్రశ్నించారు. దీనిపై ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేస్తామని ఆయన చెప్పా రు. ‘‘వారంటీ లేని కాంగ్రెస్ పార్టీ ఇచ్చే గ్యారంటీలను నమ్మేదెవరు?  50 ఏండ్లకు రాహుల్ మెచ్యూర్ అయ్యిండంటే.. ఇగ పెండ్లెప్పుడు చేసుకుంటడు?

ఎప్పుడు పిల్లల్ని కంటడు.. ఎప్పుడు దేశాన్ని పాలిస్తడు?” అని విమర్శించారు. ‘‘ఎంఐఎం.. ఎంగిలి మెతుకులకు ఆశపడే నీచమైన పార్టీ. ఆ పార్టీకి చీమునెత్తురుంటే తెలంగాణ అంతటా పోటీ చేయాలి” అని దుయ్యబట్టారు. కేసీఆర్ గతంలో రెండుసార్లు ప్రకటించిన మేనిఫెస్టోతోనే ప్రజల మైండ్ బ్లాంక్ అయిందని, ఈసారి ప్రజలే బీఆర్ఎస్  నేతల మైండ్ బ్లాంక్ అయ్యే తీర్పు ఇవ్వబోతున్నారని బండి సంజయ్​ అన్నారు. ‘‘ఎన్నికల మేనిఫెస్టో బైబిల్, ఖురాన్, భగవద్గీతతో సమానమంటూ ప్రగల్భాలు పలికిన కేసీఆర్.. మేనిఫెస్టోలోని హామీలను అమలు చేయకుండా చెత్తబుట్టకే పరిమితం చేసిండు” అని మండిపడ్డారు.

‘‘తెలంగాణలో అభివృద్ధి అంతా కేంద్రం నిధులతోనే జరిగింది. ధాన్యం కొనుగోళ్లలో రాష్ట్ర ప్రభుత్వం కేవలం బ్రోకర్ పాత్రనే పోషిస్తున్నది. రైతు బంధు పేరుతో అన్ని సబ్సిడీలను బంద్ చేసిన మూర్ఖుడు కేసీఆర్” అని దుయ్యబట్టారు. బీఆర్ఎస్ కు మళ్లీ అధికారమిస్తే రూ.5 లక్షల కోట్ల అప్పును రూ.10 లక్షల కోట్లు చేస్తుందని అన్నారు.  రజాకార్ సినిమా తీస్తే బీఆర్ఎస్ నాయకులకు ఎందుకు భయమని ఆయన ప్రశ్నించారు.  రాష్ట్రంలో ఎన్నికలను నిష్పక్షపాతంగా, నిజాయితీగా జరపాలని ఎన్నికల కమిషన్​ను కోరారు. కాగా, తాను ఎక్కడి నుంచి పోటీ చేయాలనే విషయంలో బీజేపీ అధిష్టానం నిర్ణయమే ఫైనల్  అని చెప్పారు.

నేడు బీజేపీలోకి ఆరెపల్లి మోహన్

మానకొండూరు మాజీ  ఎమ్మెల్యే, ప్రభుత్వ మాజీ విప్ ఆరెపల్లి మోహన్ గురువారం బీజేపీలో చేరనున్నారు. హైదరాబాద్​లోని పార్టీ స్టేట్ ఆఫీసులో ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర మంత్రి జి.కిషన్ రెడ్డి, జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ బండి సంజయ్ సమక్షంలో ఆయన బీజేపీ కండువా కప్పుకోనున్నారు. మోహన్​తో పాటు బీఆర్ఎస్​కు చెందిన పలువురు లోకల్​ లీడర్లు సహా సుమారు 100 మంది బీజేపీలో చేరనున్నారు. ఈ నేపథ్యంలో ఆయన తన అనుచరులతో బుధవారం కరీంనగర్ ఎంపీ ఆఫీసుకు వచ్చి బండి సంజయ్​ని కలిశారు. దాదాపు అరగంట పాటు సంజయ్ తో భేటీ అయ్యారు. ఆరెపల్లి మోహన్ మానకొండూరు నుంచి బీఆర్ఎస్ టికెట్ ఆశించారు. కానీ, సీఎం  కేసీఆర్ ​సిట్టింగులకే మళ్లీ టికెట్లు కేటాయించడంతో నెల రోజుల కింద ఆయన ఆ పార్టీకి రాజీనామా చేశారు.