- కొత్తగా గెలిచిన సర్పంచులకు సన్మానం
రాజన్న సిరిసిల్ల, వెలుగు: కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, లీడర్ల బెదిరింపులకు భయపడొద్దని బీఆర్ఎస్ మద్దతుతో గెలిచిన సర్పంచులకు ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సూచించారు. కొత్తగా ఎన్నికైన సర్పంచులను ఇబ్బంది పెట్టాలని చూస్తే సహించబోమని, వారి రక్షణ కోసం ప్రతి జిల్లాలో బీఆర్‌ఎస్ లీగల్ సెల్ ఏర్పాటు చేస్తామని చెప్పారు.
జిల్లాలో బీఆర్ఎస్ మద్దతుతో గెలిచిన సర్పంచులు, ఉపసర్పంచులను సోమవారం ఆయన సిరిసిల్లలోని తెలంగాణ భవన్‌లో సన్మానించారు. జిల్లాలో పార్టీ మద్దతుదారులు ఎక్కువ మంది గెలవడం సంతోషంగా ఉందన్నారు. ‘మిమ్మల్ని సస్పెండ్ చేస్తం, ఇబ్బంది పెడతం అని ఎవరైనా అధికారులు గానీ, అధికారపార్టీ నేతలు గానీ బెదిరిస్తే వెంటనే పార్టీని సంప్రదించండి. మీ కోసం ప్రతి జిల్లాలో లీగల్ సెల్ ఏర్పాటు చేస్తున్నం.
అరగంటలో పార్టీ యంత్రాంగం మీకు అండగా నిలుస్తుంది, కోర్టు ద్వారా మన హక్కుల కోసం కొట్లాడుదాం’ అని స్పష్టం చేశారు. రాజ్యాంగబద్ధంగా గ్రామాలకు రావాల్సిన ఫైనాన్స్ కమిషన్ నిధులను ఎవరూ ఆపలేరని వివరించారు.
కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర వ్యతిరేకత
కేవలం రెండేండ్ల పాలనలోనే కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వచ్చిందని, ఇచ్చిన హామీలు అమలు చేయడంలో ప్రభుత్వం విఫలమైందని కేటీఆర్మండిపడ్డారు. రాష్ట్రంలో 40 నుంచి 70 శాతం సర్పంచ్స్థానాలను బీఆర్ఎస్ మద్దతుదారులు గెలుచుకోవడం ఇందుకు నిదర్శనమన్నారు.
