- ఏ పార్టీ బీ ఫామ్ వస్తే ఆ పార్టీ గుర్తుతో పోటీకి రెడీ
కరీంనగర్, వెలుగు: మున్సిపల్ ఎన్నికల వేళ నామినేషన్ల పర్వంలో అనేక విచిత్రాలు చోటుచేసుకుంటున్నాయి. బరిలో ఉండాలనుకునే కొందరు అభ్యర్థులు తమ ఒకరి పేరు మీదనే కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలతోపాటు ఇండిపెండెంట్లుగా వేర్వేరు నామినేషన్లు సమర్పిస్తున్నారు. ప్రస్తుతం తాము ఉన్న పార్టీ టికెట్ ఇస్తుందో లేదోనన్న అనుమానంతోనే ఇతర పార్టీల పేరుతో ఇలా నామినేషన్లు దాఖలు చేస్తున్నారు.
చివరికి అందులో ఏ పార్టీ బీఫామ్ ఇస్తే ఆ పార్టీ గుర్తుపై పోటీ చేసేందుకు సిద్ధమవుతున్నారు. కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 56వ డివిజన్ లో సందబోయిన జ్యోతి బీజేపీ, బీఆర్ఎస్, కాంగ్రెస్, ఇండిపెండెంట్‌గా నాలుగు నామినేషన్లు వేయగా, 20వ డివిజన్‌లో పర్వతం మల్లేశం కాంగ్రెస్, బీజేపీ పేరుతో రెండు, 57వ డివిజన్ లో జక్కాని అరుణ కాంగ్రెస్, ఏఐఎఫ్‌బీ, బీఆర్ఎస్ పేరుతో మూడు నామినేషన్లు వేశారు.
రెండో డివిజన్‌లో దాసరి సాగర్ బీఆర్ఎస్ తోపాటు ఇండిపెండెంట్‌గా, 11వ డివిజన్‌లో రణవేని కవిత బీఆర్ఎస్, ఏఐఎఫ్‌బీ తరఫున, 12వ డివిజన్‌లో చొప్పరి జయశ్రీ బీజేపీ, ఇండిపెండెంట్‌గా, 19వ వార్డులో ఠాకూర్ వందనా సింగ్ బీజేపీ, ఇండిపెండెంట్ గా, అలాగే 30వ వార్డులో కళ్లెపల్లి శారద కాంగ్రెస్, ఏఐఎఫ్‌బీ, 36వ డివిజన్ లో శ్రీధర్ పోరెడ్డి కాంగ్రెస్, బీజేపీ, 39వ డివిజన్ లో సందబోయిన ముత్తయ్య ఇండిపెండెంట్, బీఆర్ఎస్, గంగుల ప్రదీప్ కుమార్ కాంగ్రెస్, ఇండిపెండెంట్, అలిపిరెడ్డి చంద్రమౌళి ఏఐఎఫ్ బీ, ఇండిపెండెంట్‌గా, 64వ డివిజన్ లో గందె కల్పన ఏఐఎఫ్ బీ, కాంగ్రెస్ పేరుతో నామినేషన్లు దాఖలు చేశారు.
