కరీంనగర్ బల్దియాలో రిజర్వేషన్లపై రగడ.. డివిజన్ల పునర్విభజనపై వివాదం

కరీంనగర్ బల్దియాలో  రిజర్వేషన్లపై రగడ.. డివిజన్ల పునర్విభజనపై వివాదం
  •     జనాభా ప్రాతిపదికన జరగలేదని ఆరోపణ
  •     కోర్టును ఆశ్రయించిన బీఆర్‌‌‌‌ఎస్, ఇతర ఆశావహులు  

కరీంనగర్, వెలుగు: కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్‌‌‌‌లో డివిజన్ల రిజర్వేషన్ల కేటాయింపు అంశం వివాదాస్పదంగా మారింది. 2011 జనాభా లెక్కల ప్రకారం కొన్ని డివిజన్లలో రిజర్వేషన్లను నిర్ధారించలేదని, కొందరికి మేలు చేసేలా మార్చారని పలువురు హైకోర్టును ఆశ్రయించడం చర్చనీయాంశంగా మారింది. ఒకవైపు ఆశావహులు టికెట్ల కోసం ప్రయత్నాలు చేస్తూనే ప్రచారానికి సిద్ధమవుతుండగా మరికొందరు రిజర్వేషన్ ప్రక్రియనే తప్పుబడుతూ కోర్టు మెట్లెక్కడం హాట్ టాపిక్ గా మారింది. 

డివిజన్ల పునర్విభజన, మ్యాపింగ్‌‌‌‌లో లోపాలతోపాటు ఒక డివిజన్ ఓట్లను మరో డివిజన్ లోకి మార్చడాన్ని మొదటి నుంచి తప్పుపడుతున్న మాజీ మంత్రి, కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ తన అనుచరులతో పిటిషన్ దాఖలు చేయించినట్లు తెలిసింది. ఆయనతోపాటు మరికొందరు కోర్టును ఆశ్రయించినట్లు సమాచారం. రిజర్వేషన్ల కేటాయింపులకు ముందు డివిజన్లవారీగా ఉన్న ఎస్సీ, ఎస్టీ, బీసీ ఓట్లు ఉన్నాయనే వివరాలు వెల్లడించకపోవడాన్ని బీఆర్ఎస్, బీజేపీతోపాటు కొందరు కాంగ్రెస్  నాయకులు తప్పుపడుతున్నారు. 

16, 27 డివిజన్ల రిజర్వేషన్లపై వివాదం

కరీంనగర్‌‌‌‌ మున్సిపల్ కార్పొరేషన్‌‌‌‌లో కొత్తపల్లి మున్సిపాలిటీతోపాటు బొమ్మకల్‌‌‌‌, దుర్శేడ్‌‌‌‌, గోపాల్‌‌‌‌పూర్‌‌‌‌, మల్కాపూర్‌‌‌‌, చింతకుంట గ్రామాలను విలీనం చేసిన విషయం తెలిసిందే. పరిధి పెరగడంతో డీలిమిటేషన్ ప్రకారం కార్పొరేషన్‌‌‌‌ను 66 డివిజన్లుగా విభజించారు. ఇందులో విలీన గ్రామం మల్కాపూర్‌‌‌‌ 16వ డివిజన్‌‌‌‌ పరిధిలోకి వెళ్లింది. 2011 జనాబా లెక్కల ప్రకారం ఈ గ్రామంలో 4,300 ఓట్లు ఉండగా, అందులో ఎస్సీలు 1,636 మంది ఉన్నారు. 

ఇందులో కొత్త ఓటర్లు చేరలేదు. 11 ఏళ్ల కింద నిర్వహించిన సమగ్ర కుటుంబ సర్వే(ఎస్‌‌‌‌కేఎస్‌‌‌‌), సోషల్, ఎడ్యుకేషన్, ఎంప్లాయ్‌‌‌‌మెంట్‌‌‌‌, ఎకనమిక్, కాస్ట్ సర్వే(సీక్‌‌‌‌) ప్రకారం ఈ గ్రామంలో ఎస్సీలే ఎక్కువగా ఉన్నారు. తాజాగా నిర్వహించిన రిజర్వేషన్ల కేటాయింపులో ఆఫీసర్లు ఈ డివిజన్ ను జనరల్ కేటగిరీకి రిజర్వ్ చేయడం వివాదాస్పదంగా మారింది. 

ఇప్పటికే ఈ అంశంపై మల్కాపూర్ వాసి సంపతి క్రాంతికుమార్ రాష్ట్ర ఎన్నికల సంఘానికి, కలెక్టర్‌‌‌‌కు ఫిర్యాదు చేశారు. అంతేగాక ఆయన హైకోర్టును ఆశ్రయించగా సోమవారం విచారణ జరిగింది. ఎస్సీల జనాభా ఎక్కువగా ఉన్న 7 వార్డులను ఎస్సీ కేటగిరీకి రిజర్వు చేశారని,  పిటిషనర్ వార్డులో ఎస్సీ జనాభా 25.49 శాతం మాత్రమే ఉందని ప్రభుత్వం తరఫు అడ్వకేట్‌‌‌‌ కోర్టుకు వివరించారు. మరికొంత సమయమిస్తే మరికొన్ని ఆధారాలు సమర్పిస్తామని చెప్పడంతో కేసును 22వ తేదీకి వాయిదా వేశారు. 

కరీంనగర్ సిటీలోని అంబేద్కర్‌‌‌‌నగర్‌‌‌‌27వ డివిజన్‌‌‌‌ పరిధిలో ఉంది. ఈ డివిజన్ లో మొత్తం ఓట్లు 4,500 ఉండగా, ఇందులో 1,200 ఓట్లు ఎస్సీ ఓట్లు, ఓసీ సామాజిక వర్గాలకు చెందిన 900 ఓట్లు ఉన్నట్లు తెలిసింది. మిగతా ఓట్లలో మెజార్టీ బీసీలవే ఉన్నట్లు స్థానిక లీడర్లు చెప్తున్నారు. కాగా ఈ డివిజన్‌‌‌‌ ఎస్సీ మహిళకు రిజర్వ్ అయింది. దీంతో తాము కూడా కోర్టును ఆశ్రయించబోతున్నట్లు స్థానిక లీడర్లు చెప్పారు.