కరీంనగర్ PMJ జ్యూవెల్లరీ షాప్ దోపిడీ కేసు.. మాస్టర్ మైండ్ సుబోధ్ సింగ్ అరెస్ట్

కరీంనగర్ PMJ జ్యూవెల్లరీ షాప్ దోపిడీ కేసు.. మాస్టర్ మైండ్ సుబోధ్ సింగ్ అరెస్ట్

హైదరాబాద్: కరీంనగర్ PMJ జ్యూవెల్లరీ షాప్ దోపిడీ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో మాస్టర్ మైండ్ సుబోధ్ సింగ్‎ను పోలీసులు అరెస్ట్ చేశారు. కరీంనగర్ పీఎంజే జ్యూవెల్లరీ షాపు రాబరీ కేసులో మాస్టర్ మైండ్ సుబోధ్ సింగ్‎ను పీటీ వారెంట్‎పై అరెస్టు చేసినట్లు సీపీ గౌస్ ఆలం ధృవీకరించారు. ఈ మేరకు శుక్రవారం (మే 29) మీడియాకు ఒక ప్రకటన విడుదల చేశారు. 

బీహార్ జైళ్లో ఉన్న సుబోధ్ సింగ్‎ను పీటీ వారెంట్‎పై అరెస్టు చేసి శుక్రవారం రాత్రి న్యాయమూర్తి ముందు హాజరు పరిచి జ్యూడిషియల్ కస్టడీకి తరలించినట్లు తెలిపారు. బీహార్‎లోని ఆరు కోర్టుల్లో పీటీ వారెంట్ల వేసి పూర్ణియా జైలు నుంచి కరీంనగర్‌కు తరలించినట్లు వెల్లడించారు. 

2026, మే 3వ తేదీన కరీంనగర్ పట్టణంలోని పీఎంజే జ్యువెలరీలో పనిచేసే ఉద్యోగులపై కాల్పులు జరిపి దోపిడీకి పాల్పడిన సంచలన రాబరీ కేసులో ప్రధాన నిందితుడు, సూత్రధారి సుభోధ్ సింగేనని తెలిపారు. అనేక కేసుల్లో సుబోధ్ సింగ్ నిందితునిగా ఉన్నట్లు చెప్పారు. 

కేసుకు సంబంధించిన అంశాలపై మరింత లోతుగా విచారణ జరిపేందుకు, నిందితుడిని వారం రోజుల పాటు పోలీసు కస్టడీకి అప్పగించాలని కోరుతూ కరీంనగర్ కోర్టులో పిటిషన్ దాఖలు చేసినట్లు తెలిపారు. కేసు దర్యాప్తు కొనసాగుతోందని, త్వరలో మరిన్ని కీలక వివరాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉందన్నారు.