- ఫిట్‌నెస్ సర్టిఫికెట్ ఉన్నవి 1,277 మాత్రమే
- 15 ఏళ్లు నిండిన బస్సులు 433
- ఫిట్ నెస్ టెస్టులకు దూరంగా మరో 344 బస్సులు
- రేపటి నుంచి స్కూళ్లు రీఓపెన్
కరీంనగర్, వెలుగు: ఉమ్మడి కరీంనగర్ జిల్లావ్యాప్తంగా సోమవారం నుంచి స్కూళ్లు ప్రారంభం కాబోతున్నాయి. అయినా ఇంకా స్కూల్, కాలేజీ బస్సులకు ఫిట్ నెస్ టెస్టులు పూర్తి కాలేదు. ఉమ్మడి జిల్లాలో 2,249 స్కూల్ బస్సులు ఉండగా.. ఇప్పటి వరకు ఫిట్ నెస్ టెస్టులు పూర్తయి సర్టిఫికెట్ పొందిన బస్సులు 1,277 మాత్రమే ఉన్నాయి. ఫిట్‌నెస్‌కు దూరంగా మరో 344 బస్సులు ఉండగా.. నిబంధనల ప్రకారం15 ఏళ్లు పూర్తయిన బస్సులు 433 వరకు ఉన్నాయి. స్కూళ్లు ప్రారంభం కానున్న తరుణంలో ఇంకా ఫిట్ నెస్ టెస్టులకు రాని బస్సులు, 15 ఏళ్లు గడువు తీరిన బస్సుల విషయంలో ఆందోళన నెలకొంది. మరోవైపు స్కూల్ బస్సులను ఆర్టీఏ ఆఫీసుకు తీసుకురావడంలో ఆయా పాఠశాల యాజమాన్యాల నిర్లక్ష్యంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. 15 ఏళ్లు నిండిన బస్సులు కరీంనగర్ లో 332, పెద్దపల్లి జిల్లాలో 32, రాజన్న సిరిసిల్ల జిల్లాలో 5, జగిత్యాల జిల్లాలో 64వరకు ఉన్నాయి.
తనిఖీల తీరుపై అనుమానాలు
ఆర్టీఏ అధికారులు తనిఖీలు చేస్తున్న తీరుపైనా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. వెహికల్ ఇన్ స్పెక్టర్లు స్వయంగా నడిపి పరిశీలించాల్సి ఉండగా.. కేవలం డ్రైవర్ నడుపుతుంటే చూసి ఓకే చెప్తున్నారు. టైర్లు, ఇండికేటర్లు, ఫస్ట్ ఎయిడ్ బాక్స్, ఎమర్జెన్సీ డోర్, హెడ్ లైట్లు, బ్రేక్ లు, స్టీరింగ్ విషయంలో డ్రైవర్లు చెప్పిందే టిక్ చేస్తున్నారని, పూర్తిగా పరిశీలించడం లేదని ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఫైర్ ఎక్స్ టింగ్విషర్ పనిచేస్తుందా లేదా? ఎక్స్పైరీ డేట్ ఉందా లేదా అనేది పట్టించుకోవడం లేదనే విమర్శలు ఉన్నాయి.
సోమవారం నుంచి ఆకస్మిక తనిఖీలకు ప్లాన్
ఉమ్మడి జిల్లాలో ఫిట్‌నెస్ టెస్టులకు దూరంగా 344 బస్సులు ఉండడంతోపాటు 15 ఏళ్లు పూర్తయిన బస్సులు 433 వరకు ఉన్నట్లు రవాణా శాఖ అధికారులు గుర్తించారు. ఇలాంటి బస్సులు రోడ్డెక్కే అవకాశం ఉండడంతో సోమవారం నుంచి తనిఖీలు నిర్వహించేందుకు రవాణా శాఖ అధికారులు ప్లాన్ చేస్తున్నారు. ఇప్పటికే ఈ మేరకు రవాణా శాఖ జాయింట్ ట్రాన్స్ పోర్ట్ కమిషనర్(జేటీసీ) మామిండ్ల చంద్రశేఖర్ గౌడ్ జిల్లా అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ప్రతి వాహనానికి ఫిట్‌నెస్ సర్టిఫికెట్, పర్మిట్, ఇన్సూరెన్స్, పొల్యుషన్ కంట్రోల్ సర్టిఫికేట్ ఉన్నాయా లేదా? అని చెక్ చేయబోతున్నారు. డ్రైవర్ల డ్రైవింగ్ లైసెన్స్, ఎక్స్‌పీరియన్స్, ఫస్ట్ ఎయిడ్ బాక్స్, ఎమర్జెన్సీ ఎగ్జిట్ వంటి భద్రతా సౌకర్యాలు, టైర్లు పరిశీలించనున్నారు. ఫిట్‌నెస్ లేకుండా స్కూల్ బస్సులు రోడ్డెక్కితే విద్యా సంస్థల యాజమాన్యాలపై కేసులు నమోదు చేయాలని జేటీసీ ఆదేశాలు జారీ చేశారు.
