
న్యూఢిల్లీ: గాయపడిన ప్లేయర్‌కు ప్రత్యామ్నాయం ఉండాలని సూచించిన టీమిండియా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ వ్యాఖ్యలను ఇంగ్లండ్ కెప్టెన్ బెన్ స్టోక్స్ కొట్టి పారేయడంపై మాజీ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ స్పందించాడు. ఏదైనా విషయాన్ని మాట్లాడేముందు ఆలోచించుకోవాలని చురకంటించాడు. ‘ఈ సిరీస్‌లో కర్మ గురించి నేను మాట్లాడాలనుకుంటున్నా.
కర్మ తక్షణమే ప్రభావం చూపిస్తుంది. ఎవ్వరినీ వదిలిపెట్టదు. మనం ఏమి విత్తుతామో.. దానినే కోస్తాం అని తమిళంలో ఓ సామెత ఉంది. పంత్ గాయం గురించి మాట్లాడినప్పుడు గంభీర్ ప్రత్యామ్నాయం ఉండాలని సూచించాడు. కానీ స్టోక్స్ అదో జోక్ అని కొట్టి పారేశాడు. కనీసం ఏమాత్రం ఆలోచించకుండా మాట్లాడాడు. ఆ కర్మ వెంటనే ఇంగ్లండ్‌కు తగిలింది. గాయమైనా సరే వోక్స్ బ్యాటింగ్‌కు దిగాల్సి వచ్చింది. అతని పట్టుదలను నేను అభినందిస్తున్నా. కానీ స్టోక్స్ మాటలను మాత్రం తిరస్కరిస్తున్నా’ అని అశ్విన్ వ్యాఖ్యానించాడు.