ఢిల్లీ సీఎంను కలిసిన కరణం మల్లేశ్వరి

 ఢిల్లీ సీఎంను కలిసిన కరణం మల్లేశ్వరి

న్యూఢిల్లీ: తెలుగు దిగ్గజ వెయిట్ లిఫ్టర్ కరణం మల్లేశ్వరి బుధవారం ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ ను కలిశారు. ఢిల్లీ యూనివర్సిటీ వైస్ ఛాన్స్ లర్ గా నియమితురాలైన ఆమె ఇవాళ సీఎం నివాసానికి వెళ్లి మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. కరణం మల్లేశ్వరి తనను కలసి పలు అంశాలు చర్చించినట్లు ముఖ్యమంత్రి కేజ్రీవాల్ ట్వీట్ చేశారు. ’ఢిల్లీ స్పోర్ట్స్ యూనివర్సిటీ ప్రారంభం కానుంది.. మా పెద్దల కల సాకారమవుతోంది.. 2000 సంవత్సరం సిడ్నీఒలింపిక్స్ వెయిట్ లిఫ్టింగులో పతకం సాధించిన కరణం మల్లీశ్వరి తొలి వైస్ ఛాన్స్ లర్ కావడం మాకెంతో గర్వకారణం’ అని కేజ్రీవాల్ పేర్కొన్నారు. డిల్లీ యూనివర్సిటీ వైస్ ఛాన్స్ లర్ గా కరణం ఏపీలోని శ్రీకాకుళం జిల్లాకు చెందిన  మల్లీశ్వరికే అవకాశం కల్పిస్తూ మంగళవారం రాత్రి ఢిల్లీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెలిసిందే. తన నియామకంపై సంతోషం వ్యక్తం చేసిన కరణం మల్లీశ్వరి బుధవారం ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ నివాసానికి వెళ్లి మర్యాదపూర్వకంగా కలిసింది. ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా కూడా ఈ భేటీలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా పలు అంశాలు మల్లీశ్వరితో చర్చించడం జరిగిందని.. కేజ్రీవాల్ స్వయంగా ట్విట్టర్ లో ప్రకటించడం విశేషం. ఆమెతో భేటీ అయిన ఫోటోలు కూడా ట్విట్టర్ లో జత చేయడం కరణం మల్లీశ్వరికి ఆయన ఇస్తున్న ప్రాధాన్యతను తెలియజేస్తున్నాయి.
దేశం గర్వించే ఆటగాళ్లను అందించండి: పవన్ కళ్యాణ్
కరణం మల్లీశ్వరి ఢిల్లీ స్పోర్ట్స్ యూనివర్సిటీ వైస్ ఛాన్స్ లర్ గా నియమితురాలు కావడంపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ స్పందించారు. దేశ రాజధాని ఢిల్లీ క్రీడా వర్సిటీకి వైస్ ఛాన్స్ లర్ గా నియమితురాలు కావడం సంతోషదాయకం అని.. తమ పార్టీ తరపున అభినందనలు తెలియజేశారు. ఏపీలోని శ్రీకాకుళం నుంచి ఆస్ట్రేలియాలోని సిడ్నీ దాకా ఆమె సాగించిన ప్రస్థానం ఎంతో విలువైనదని ఆయన ఒక ప్రకటనలో పేర్కొన్నారు. కరణం మల్లీశ్వరి ఎంతో మంది యువతకు, ముఖ్యంగా మహిళలకు స్ఫూర్తి దాయకంగా నిలిచారని ఆయన కొనియాడారు. ఇప్పుడు కీలక బాద్యతల్లో కూడా ఆమె రాణించి అందరికీ మార్గదర్శకంగా నిలుస్తారనే నమ్మకం తనకుందని పవన్ కళ్యాణ్ ఆశాభావం వ్యక్తం చేశారు. గ్రామీణ, వెనుకబడిన ప్రాంతాల్లో ఎంతో మంది మట్టిలో మాణిక్యాల్లా ఉన్నారని.. వారిలోని నైపుణ్యాలను వెలికి తీసి ఆణిముత్యాల్లా తీర్చిదిద్దాలని పవన్ కళ్యాణ్ కోరారు.