
కరోనావైరస్ వ్యాప్తిని నివారించడానికి విధించిన లాక్డౌన్ వల్ల తీవ్రంగా దెబ్బతిన్న వారికోసం కర్ణాటక ప్రభుత్వం రూ. 1600 కోట్ల ప్యాకేజీని ప్రకటించింది. ఈ ప్యాకేజీ వల్ల రైతులు, చిన్న మరియు మధ్యతరహా సంస్థలు, చేనేత కార్మికులు, పూల పెంపకందారులు, ధోబీలు, బార్బర్స్, ఆటో మరియు టాక్సీ డ్రైవర్లకు ప్రయోజనం చేకూరుతుంది కర్ణాటక ప్రభుత్వం తెలిపింది.
ఈ ప్యాకేజీ ద్వారా పూల పెంపకందారులకు హెక్టారుకు రూ .25 వేల ఆర్థికసాయం లభిస్తుంది. ధోబీలు మరియు బార్బర్‌లకు ఈ ప్యాకేజీ కింద వన్ టైం సెటిల్మెంట్ ద్వారా రూ .5 వేల సాయం లభిస్తుంది. అలాగే ఆటో, టాక్సీ డ్రైవర్లకు రూ .5 వేల సాయం లభిస్తుంది. భవన నిర్మాణ కార్మికులకు గతంలో రూ. 2వేల సాయం ప్రకటించారు. అది కాకుండా… మరో రూ. 3 వేలు ఈ ప్యాకేజీ కింద లభిస్తుందని ఆ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. చేనేత కార్మికులకు కూడా రూ .2,000 వారి బ్యాంకు ఖాతాల్లో వేయనున్నట్లు ప్రభుత్వం తెలిపింది.
‘కరోనావైరస్ రైతులను ప్రభావితం చేయడమే కాకుండా.. పట్టణ మరియు గ్రామీణ ప్రాంతాల్లోని బార్బర్స్ మరియు ధోబీలను కూడా ప్రభావితం చేసింది. అందుకే రాష్ట్రంలోని 60,000 మంది ధోబీలకు ఈ ప్యాకేజీ ద్వారా ఒక్కొక్కరికి 5,000 రూపాయల చొప్పున పరిహారం ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. అలాగే రాష్ట్రంలో సుమారు 2,30,000 మంది బార్బర్లు ఉన్నారు. వారికి కూడా ఒక్కొక్కరికి రూ. 5 వేలు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది’అని కర్ణాటక ముఖ్యమంత్రి బీఎస్ యెడియూరప్ప తెలిపారు.
లాక్డౌన్ వల్ల చాలా పరిశ్రమలలో ఉత్పత్తి ఆగిపోయింది. అందువల్ల సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమలకు రెండు నెలల విద్యుత్ బిల్లులు మాఫీ చేయనున్నట్లు కర్ణాటక ప్రభుత్వం ప్రకటించింది. పెద్ద పరిశ్రమలకు మాత్రం రెండు నెలల పాటు విద్యుత్ బిల్లులు వాయిదా వేయబడతాయని తెలిపింది.
ప్రస్తుతం కర్ణాటకలో మూడు జిల్లాలు రెడ్ జోన్లో ఉన్నాయి. అందులో బెంగళూరు కూడా ఉంది. కర్ణాటక ప్రభుత్వానికి బెంగుళూరు నుంచి అధిక ఆదాయం వచ్చేది. అయితే బెంగుళూర్ రెడ్ జోన్లో ఉండటం ఇప్పుడు ఆదాయం అంతంతమాత్రంగానే ఉంది. ఇప్పటివరకు కర్ణాటకలో 692 కరోనావైరస్ కేసులు నమోదుకాగా.. 29 మంది చనిపోయారు.
లాక్డౌన్లో భాగంగా రాష్ట్రంలో అనేక ఆంక్షలు ఇప్పటికీ అమలులో ఉన్నాయి. మార్చిలో లాక్‌డౌన్ ప్రకటించినప్పటి నుంచి రాష్ట్ర ప్రభుత్వ ఆదాయం తీవ్రంగా తగ్గింది. దాంతో సోమవారం నుంచి అక్కడ మద్యం షాపులు తెరిచారు. షాపులు తెరచిన మొదటి రోజే రూ .45 కోట్ల ఆదాయం లభించింది. రెండో రోజు ఏకంగా రూ . 197 కోట్ల మద్యం అమ్మకాలు జరిగాయి.
For More News..