
కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ఓ ప్రైవేటు జెట్‌లో ప్రయాణిస్తున్నట్లు కనిపిస్తోన్న వీడియోపై బీజేపీ విమర్శలు చేస్తోంది. ఒకవైపు రాష్ట్రం కరవు పరిస్థితులు ఉంటే.. సీఎం సిద్ధరామయ్య, మంత్రులు ప్రైవేటు జెట్‌లో ప్రయాణిస్తారా..? అంటూ కర్నాటక బీజేపీ ఎదురుదాడికి దిగుతోంది. అధికార పార్టీ నేతలు సంపన్న, విలాసవంతమైన జీవనశైలిని ప్రదర్శిస్తున్నారంటూ మండిపడింది. బీజేపీ రిలీల్ చేసిన వీడియోలో కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్యతోపాటు మంత్రులు జమీర్ అహ్మద్ ఖాన్, కృష్ణ బైరేగౌడ ఉన్నారు.
రాష్ట్రం మొత్తం తీవ్ర కరవుతో అల్లాడుతోందని, వర్షాభావ పరిస్థితులతో పంటలు కోల్పోయి.. రైతులు సంక్షోభంలో కూరుకుపోయారని బీజేపీ కర్ణాటక అధ్యక్షుడు బీవై విజయేంద్ర ‘ఎక్స్’ (ట్విట్టర్) వేదికగా విమర్శించారు. ఇప్పటికే అభివృద్ధి పనులు నిలిచిపోయాయని, ఇటువంటి పరిస్థితుల్లో సీఎం, రాష్ట్ర మంత్రులు వారి సంపన్న, విలాసవంతమైన జీవనశైలిని ప్రదర్శిస్తున్నారని ఆరోపించారు. కేంద్రం నుంచి కరవు సహాయక నిధుల అభ్యర్థన కోసం ఢిల్లీకి వెళ్లేందుకు విమానంలో ప్రయాణించారు సీఎం సిద్ధరామయ్య, మంత్రులు.
బీజేపీ కర్ణాటక అధ్యక్షుడు బీవై విజయేంద్ర విమర్శలపై సీఎం సిద్ధరామయ్య స్పందించారు. ‘ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఏ విధంగా ప్రయాణిస్తారు? ఏ విమానంలో రాకపోకలు సాగిస్తారు? బీజేపీ నేతలను ఈ ప్రశ్నలు అడగండి’’ అంటూ కౌంటర్ ఇచ్చారు.