లంచం కేసులో బీజేపీ ఎమ్మెల్యే అరెస్ట్

లంచం కేసులో బీజేపీ ఎమ్మెల్యే అరెస్ట్

కర్ణాటక బీజేపీ ఎమ్మెల్యే మాదాల్ విరూపాక్షప్ప అరెస్ట్ అయ్యారు.  ఆయన చైర్మన్‌గా ఉన్న కర్ణాటక సోప్స్ అండ్ డిటర్జెంట్స్ లిమిటెడ్‌కు సంబంధించిన లంచం కేసులో ఆయనను పోలీసులు అరెస్ట్ చేశారు. బెంగళూరుకు వస్తుండగా తుమకూరులోని క్యాత్‌సంద్ర సమీపంలో ఆయన్ను  లోకాయుక్త పోలీసులు  అదుపులోకి తీసుకున్నారు.   రూ. 40 లక్షలు లంచం తీసుకుంటూ అతని కుమారుడు ప్రశాంత్ మాదాల్ పట్టుబడటంతో అతన్ని ఈ కేసులో ప్రధాన నిందితుడిగా పోలీసులు  పేర్కొన్నారు.  విరూపాక్షప్ప అరెస్ట్ కాకుండానే ముందస్తు బెయిల్ తెచ్చుకున్నారు. అయితే తాజాగా ఆయన  ముందస్తు బెయిల్ పిటిషన్‌ను కర్ణాటక హైకోర్టు సింగిల్ మెంబర్ బెంచ్ కొట్టివేసింది.  దీంతో వెంటనే  పోలీసులు ఆయన్ను అరెస్ట్ చేశారు. 

కొద్ది రోజుల క్రితం ఎమ్మెల్యే మాదాల్ విరూపాక్షప్ప కుమారుడు ప్రశాంత్ మాదాల్ లంచం తీసుకుంటుండగా లోకాయుక్త పోలీసులకు పట్టుబడ్డాడు. ఆ తర్వాత దావణగెరెలోని మాదాల్ నివాసంపై కూడా లోకాయుక్త పోలీసులు దాడులు నిర్వహించారు. ఆయన నివాసంలో కూడా కోట్లాది రూ. నగదు దొరికింది. కొద్దిరోజుల పాటు కనిపించకుండా పోయిన ఎమ్మెల్యే మాదాల్ బెయిల్ పొందిన తర్వాత బహిరంగంగా కనిపించారు. హడావుడిగా ఆయనకు బెయిల్ మంజూరు చేయడంపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది. చన్నగిరి నియోజకవర్గం నుంచి మాదాల్‌ విరూపాక్షప్ప కుమారుడు మాదాల్‌ మల్లికార్జున్‌ బీజేపీ టికెట్‌ ఆశించారు. అయితే ముందస్తు బెయిల్‌ పిటిషన్‌ కొట్టివేయడంతో మాదాల్‌ విరూపాక్షప్ప అరెస్ట్‌ కావడంతో మల్లికార్జున్‌కు టికెట్‌ కష్టమేనని అంటున్నారు.