ఇకపై ఎన్నికల్లో పోటీ చేయను .. కర్ణాటక సీఎం కీలక ప్రకటన

ఇకపై ఎన్నికల్లో పోటీ చేయను  .. కర్ణాటక సీఎం కీలక ప్రకటన

ఇకపై ఎన్నికల్లో పోటీ చేయకూడదని నిర్ణయించుకున్నట్లు కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య 2024 ఏప్రిల్ 2వ తేదీ మంగళవారం తెలిపారు. 2023 అసెంబ్లీ ఎన్నికల సమయంలోనే అదే తన చివరి ఎన్నికలని చెప్పానని , అయినా రాజకీయాల్లోనే కొనసాగుతానన్నారు.  విలేకరులతో సీఎం మాట్లాడుతూ.. 2028 నాటికి (కర్ణాటకలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న తరుణంలో) నాకు 82 ఏళ్లు నిండుతాయని, రాజకీయాల్లోకి వచ్చి 50 ఏళ్లు పూర్తి చేసుకుంటానని తెలిపారు. 

అప్పుడు  పని చేసేందుకు అవసరమైన ఆరోగ్యం, ఉత్సాహం తనకు ఉండవని చెప్పారు. 2023  మేలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో సిద్ధరామయ్య వరుణ నియోజకవర్గం నుంచి పోటీ చేసి విజయం సాధించి తొమ్మిదోసారి అసెంబ్లీలో అడుగుపెట్టారు. 1983లో అసెంబ్లీకి అరంగేట్రం చేసిన సిద్ధరామయ్య చాముండేశ్వరి నుంచి లోక్‌దళ్ పార్టీ టికెట్‌పై ఎన్నికయ్యారు. ఈ నియోజకవర్గం నుంచి ఐదుసార్లు గెలిచిన ఆయన మూడుసార్లు ఓటమి చవిచూశారు. 2013, 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలోనూ ఇదే తన చివరి ఎన్నికలంటూ సిద్ధరామయ్య  ప్రకటిస్తూ వచ్చారు.