కర్నాటక సీఎం యడ్యూరప్పకు సమన్లు

కర్నాటక సీఎం యడ్యూరప్పకు సమన్లు

బెంగళూరు: కర్నాటక ముఖ్యమంత్రి బీఎస్ యడ్యూరప్పకు ఆ రాష్ట్రంలోని గోకక్ కోర్టు శుక్రవారం సమన్లు జారీ చేసింది. 2019 అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్‌ను ఉల్లంఘించినందుకు యడ్డీకి కోర్టు సమన్స్‌ ఇష్యూ చేసింది. యడ్డీ తన స్పీచ్‌లో రెండు సార్లు ప్రత్యేకంగా ఓ సామాజిక వర్గానికి అప్పీల్ చేశారని జ్యుడీషియల్ మెజిస్ట్రేట్ ఫస్ట్‌ క్లాస్ కోర్టు పేర్కొంది. ఈ విషయంపై సీఎం, ఆయన కార్యాలయం ఇంతవరకు స్పందించలేదు.

గతేడాది నవంబర్ 23న గోకక్ నియోజకవర్గంలో నిర్వహించిన ఎన్నికల ర్యాలీలో యడ్డీ పాల్గొన్నారు. అందులో భాగంగా ఆయన మాట్లాడుతూ తమ ఓట్లు విభజన కాకుండా చూడాలని వీరశైవ లింగాయత్ కమ్యూనిటీ ప్రజలకు యడ్డీ విజ్ఞప్తి చేశారు. అలాగే బీజేపీ అభ్యర్థి రమేశ్ జర్కిహోలిని గెలిపించాలని కోరారు. దీనిపై కాంగ్రెస్‌తోపాటు జేడీఎస్ నిరసనకు దిగాయి. ప్రత్యేకంగా ఓ సామాజిక వర్గానికి చెందిన ప్రజలను ఓట్ల కోసం అప్పీల్ చేయడమంటే ఎలక్షన్ కమిషన్ మోడల్ కోడ్ ఆఫ్​ కండక్ట్‌ను అతిక్రమించడమేనని ఆ పార్టీలు మండిపడ్డాయి. ఈ ఘటనపై కేసు వేశాయి. గోకక్‌లో వీరశైవ లింగాయత్‌ కమ్యూనిటీకి చెందిన ప్రజలు పెద్ద సంఖ్యలో ఉన్నారు. ఎన్నికల్లో ఈ వర్గం ఓటర్లే కీలకం. కాగా, ఈ ఎన్నికల్లో రమేశ్ జర్కిహోలి తన సోదరుడు. కాంగ్రెస్ అభ్యర్థి లఖన్ జర్కిహోలిని 29 వేల ఓట్ల తేడాతో గెలిచారు.