టీటీడీకి నందిని మిల్క్ డేయిరీ షాక్..అలా అయితే కష్టమే

టీటీడీకి నందిని మిల్క్ డేయిరీ షాక్..అలా అయితే కష్టమే

టీటీడీకి కర్ణాటక మిల్క్ ఫెడరేషన్ షాక్ ఇచ్చింది. నందిని పాల బ్రాండ్ నెయ్యిని తిరుమల తిరుపతి దేవస్థానానికి సరఫరా చేయొద్దని  నిర్ణయించింది. నెయ్యి ధరకు సంబంధించిన సమస్య వల్ల టెండరు ప్రక్రియలో పాల్గొనేది లేదని  కర్ణాటక మిల్క్ ఫెడరేషన్ స్పష్టం చేసింది.  రైతుల ప్రయోజనాల కోసం ఏర్పాటైన తమ సంస్థ ..తక్కువ ధరకు నెయ్యిని సరఫరా చేసి.. నష్టపోవడం సరైనది కాదని భావిస్తున్నట్లు..అందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు మిల్క్ ఫెడరేషన్ అధికారులు తెలిపారు. 

టీటీడీకి నెయ్యి సరఫరా చేసేందుకు కర్ణాటక  నందిని మిల్క్ డేయిరీ టెండర్లో  కేజీకి రూ. 400 పైగా కోట్ చేసిందని కర్ణాటక మిల్క్ ఫెడరేషన్ ఎండీ జగదీష్ తెలిపారు. అయితే అంతకన్నా తక్కువకు కోట్ చేసేవారు ఉండరని చెప్పారు. రూ. 400 కంటే తక్కువ కోట్ చేస్తే మాత్రం నష్టాలు వస్తాయని..అందుకే తాము టీటీడీ నెయ్యి టెండర్లలో పాల్గొనబోమని స్పష్టం చేశారు.  అయితే ఈ టెండర్లో పాల్గొనాలని టీటీడీ తమను కోరిందని..కానీ పోటీ ధరలకు తాము నెయ్యిని సరఫరా చేయలేమన్నారు. తాము నిర్ణయించిన ధరకు మాత్రమే సరఫరా చేయగలమన్నారు. అందుకు టీటీడీ తిరస్కరించిందని..అందుకే తాము టీటీడీకి నెయ్యిని సరఫరా చేయడం లేదని పేర్కొన్నారు. 

కర్ణాటక మిల్క్ ఫెడరేషన్ వాదనను టీటీడీ ఈవో ధర్నా రెడ్డి తప్పుపట్టారు. తాము ఈ-టెండర్ల ద్వారా మాత్రమే నెయ్యిని కొనుగోలు చేస్తామని చెప్పారు. అయితే నెయ్యిని సరఫరా చేయడానికి టీటీడీ అవకాశం ఇవ్వడం లేదన్న కర్ణాటక మిల్క్ ఫెడరేషన్ వాదనల్లో వాస్తవం లేదన్నారు. ఈ-టెండర్లను తెరిచే వరకు టెండర్లు ఎవరు వేశారో కూడా తమకు తెలియదన్నారు.