కర్ణాటక ఎన్నికలు : పూల వర్షంలో మోడీ మెగా రోడ్ షో

కర్ణాటక ఎన్నికలు  : పూల వర్షంలో మోడీ మెగా రోడ్ షో

కర్ణాటకలో ఎన్నికలు సమీపిస్తోన్న నేపథ్యంలో... పొలిటికల్ పార్టీ ప్రచారాన్ని వేగవంతం చేశాయి. చివరి దశకు చేరుకున్న ఈ ఎన్నికల ప్రచారంలో ప్రధాని మోడీ స్వయంగా రంగంలోకి దిగారు. మే6, 7 తేదీల్లో బెంగళూరులో భారీ రోడ్ షో నిర్వహించనున్నారని ఇప్పటికే బీజేపీ అధికారికంగా ప్రకటించగా.. తాజాగా ప్రధాని రోడ్ షో అత్యంత అట్టహాసంగా ప్రారంభమైంది. ఉదయం 10 గంటలకు ప్రారంభమైన ఈ భారీ రోడ్ షో 13 అసెంబ్లీ నియోజకవర్గాల మీదుగా 26 కిలోమీటర్ల మేర సాగనుంది. ఇది మధ్యాహ్నం 1.30 గంటల వరకు జరగనుందని పార్టీ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఈ రోడ్ షో జేపీ నగరంలోని బ్రిగేడ్ మిలీనియం నుంచి బెంగళూరు సెంట్రల్‌లోని మల్లేశ్వరంలోని మారమ్మ సర్కిల్ వరకు జరగనుంది.

ప్రధాని మోడీ చేపట్టిన ఈ భారీ రోడ్ షోకు.. బీజేపీ కార్యకర్తలు భారీగా తరలివచ్చారు. అశేష జన వాహిని మధ్య ఈ రోడ్ షో సాగుతుండగా.. ప్రధాని మోడీ ప్రజలకు అభివాదం చేస్తూ ముందుకు సాగుతున్నారు. ఈ సందర్భంగా భారీ సంఖ్యలో అక్కడికి చేరుకున్న ప్రజలు, పార్టీ కార్యకర్తలు ప్రధాని మోడీపై పువ్వులు చల్లుతూ మద్దతు పలికారు. ఈ క్రమంలోనే అధికారులు భారీ భద్రత ఏర్పాటు చేశారు. బెంగళూరులోని దాదాపు 34 రోడ్లను మూసివేసినట్టు తెలుస్తోంది. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా బలగాలు మోహరించి, పరిస్థితిని అదుపులో ఉంచేందుకు ఏర్పాట్లు చేశారు.

ఇంతకుముందు మే 6న 10 కిలోమీటర్లు, 7న 26 కిలోమీటర్ల మేర రోడ్ షో నిర్వహించాలని భావించారు. కానీ ఆదివారం నీట్ పరీక్ష వల్ల ఉన్నందువల్ల ఇవాళ 26 కిలోమీటర్ల రోడ్ షో నిర్వహిస్తుండగా.. ఆదివారం తిప్పసంద్రలోని కెంపేగౌడ విగ్రహం నుంచి ట్రినిటీ వరకు 10 కిలోమీటర్ల మేర రోడ్ షో నిర్వహించనున్నారు. ఆదివారం ఉదయం 10 గంటల నుంచి 11.30 గంటల వరకు ఇది జరగనుంది. మొత్తం రెండు రోజుల పాటు కర్ణాటకలో మోదీ రోడ్ షో జరగనుంది.

ఈ సందర్భంగా ఆయన ట్విట్టర్ వేదికగా.. కర్ణాటక అభివృద్ధిని గురించి ప్రస్తావించారు. ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా.. ఇప్పటి వరకు తాము చేసిన పనులను వివరిస్తూ.. తదుపరి ప్రభుత్వం ఏర్పాటైతే ఏం చేస్తామనేది వివరిస్తూ మోడీ ట్వీట్‌లో పేర్కొన్నారు.

ఇక కర్ణాటక ఎన్నికల ప్రచారంలో భాగంగా ఇప్పటికే బీజేపీతో సహా పలు పార్టీలు రోడ్ షోలు, ర్యాలీలు చేస్తున్నాయి. రాజకీయ పార్టీలన్నీ ప్రచారాన్ని హోరెత్తిస్తున్నాయి. ఓటర్లను ఆకర్షించేందుకు తమ వంతు ప్రయత్నాలు చేస్తున్నాయి. కాగా కర్ణాటకలో రెండోసారి అధికారాన్ని చేజిక్కించుకునేందుకు బీజేపీ తీవ్రంగా కృషి చేస్తోంది. ఇదిలా ఉండగా కర్ణాటకలో 15వ అసెంబ్లీ ఎన్నికలు ఒకే దశలో మే 10, 2023న నిర్వహించబడతాయి. ఎన్నికల ఫలితాలు మే 13, 2023న ప్రకటించబడతాయి.

https://twitter.com/ANI/status/1654714734741164032