Karnataka Election Results : ఉదయం 8 గంటలకు ఓట్ల లెక్కింపు షురూ.. 36 కేంద్రాల్లో కౌంటింగ్​

Karnataka Election Results : ఉదయం 8 గంటలకు ఓట్ల లెక్కింపు షురూ.. 36 కేంద్రాల్లో కౌంటింగ్​

బెంగళూరు: కర్నాటక అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు శనివారం వెల్లడికానున్నాయి. రాష్ట్రంలోని 224 అసెంబ్లీ నియోజకవర్గాలకు బుధవారం పోలింగ్ జరగగా.. శనివారం ఉదయం 8 గంటలకు ఓట్ల లెక్కింపు షురూ కానుంది. మధ్యాహ్నం ఒంటి గంటకల్లా ఫలితాలపై ఒక క్లారిటీ వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఓట్ల లెక్కింపు కోసం రాష్ట్రవ్యాప్తంగా 36 సెంటర్లను ఏర్పాటు చేసినట్లు ఎన్నికల సంఘం అధికారులు శుక్రవారం వెల్లడించారు. ఒక్క బెంగళూరు జిల్లా పరిధిలోనే 32 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉండటంతో ఐదు సెంటర్లలో కౌంటింగ్ చేపట్టనున్నారు. జిల్లా అంతటా ఎలాంటి అవాంఛనీయ ఘటనలకు తావులేకుండా ఉదయం 6 గంటల నుంచి ఆదివారం తెల్లవారుజామున 12 గంటల వరకూ కర్ఫ్యూ విధించినట్లు బెంగళూరు పోలీసులు ప్రకటించారు.

వైన్స్ షాపులు క్లోజ్ చేయిస్తున్నామని, సిటీలోని ఆయా ప్రాంతాల్లో ట్రాఫిక్ డైవర్షన్లు ఉంటాయని తెలిపారు. ఇక ఈ ఎన్నికల్లో అన్ని పార్టీల నుంచి కలిపి మొత్తం 2,615 మంది క్యాండిడేట్లు బరిలో ఉన్నారు. వారం మధ్య బుధవారం రోజున పోలింగ్ నిర్వహించడంతో రికార్డ్ స్థాయిలో 73.19 శాతం పోలింగ్ నమోదైంది. ఎన్నికల్లో ప్రధానంగా రూలింగ్ పార్టీ బీజేపీ, అపొజిషన్ పార్టీ కాంగ్రెస్ మధ్య హోరాహోరి పోరు నెలకొంది. కాంగ్రెస్, బీజేపీ మధ్య టైట్ పోటీ ఉండగా, హంగ్ ఏర్పడే అవకాశాలు కూడా ఉన్నాయని ఎగ్జిట్ పోల్స్ అంచనాలు స్పష్టం చేశాయి.

అయితే, కర్నాటకలో గత 38 ఏండ్లుగా ఓటర్లు ప్రతిసారీ అధికార పార్టీని ఓడగొడ్తూ వచ్చారు. ఈ సారి మాత్రం తమను మార్చబోరని, మళ్లీ తమకే పట్టం కడతారని బీజేపీ ధీమాతో ఉండగా, ఆనవాయితీ ప్రకారం తమకే అధికారం దక్కుతుందని ప్రధాన ప్రతిపక్షమైన కాంగ్రెస్ భావిస్తోంది. జేడీఎస్ మాత్రం హంగ్ అసెంబ్లీ ఏర్పడితే కింగ్ మేకర్ అవ్వొచ్చన్న ఆశతో ఉంది.