లక్నో: రంజీ ట్రోఫీలో కర్నాటక 11 ఏండ్ల తర్వాత మళ్లీ ఫైనల్లో అడుగు పెట్టింది. ఉత్తరాఖండ్‌తో గురువారం ముగిసిన సెమీఫైనల్ డ్రా కావడంతో తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం ఆధారంగా ఆ జట్టు ఫైనల్ బెర్తు సొంతం చేసుకుంది. ఓవర్‌నైట్ స్కోరు 299/6తో చివరి రోజు ఆట కొనసాగించిన కర్నాటక 323 రన్స్ వద్ద ఆలౌటైంది. తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం కలుపుకొని ఉత్తరాఖండ్ ముందు 826 టార్గెట్ ఉంచింది. అసాధ్యమైన లక్ష్య ఛేదనకు దిగిన ఉత్తరాఖండ్ మ్యాచ్ చివరకు 260/6 స్కోరు చేసింది.
అన్వేశ్ సుధా (66), అభయ్ నేగి (57 నాటౌట్), సచిన్ రావత్ (53 నాటౌట్) రాణించారు. శ్రేయస్ గోపాల్ మూడు, ప్రసిధ్ కృష్ణ రెండు వికెట్లు పడగొట్టారు. తొలి ఇన్నింగ్స్‌లో కర్నాటక 736 రన్స్ చేయగా.. ఉత్తరాఖండ్ 233 స్కోరుకే ఆలౌటైంది. డబుల్ సెంచరీ హీరో దేవదత్ పడిక్కల్‌కు ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు లభించింది. హుబ్లీ క్రికెట్ గ్రౌండ్‌లో ఈ నెల 24 నుంచి జరిగే ఫైనల్లో జమ్మూ కాశ్మీర్‌తో కర్నాటక అమీతుమీ తేల్చుకోనుంది.
