
- కర్ణాటకకు చెందిన ముఠా అరెస్ట్.. పరారీలో ప్రధాన నిందితుడు
- ఆదిలాబాద్ ఎస్పీ అఖిల్ మహాజన్
ఆదిలాబాద్, వెలుగు : అనారోగ్యాన్ని ఆయుర్వేద మందులతో తగ్గిస్తామని రూ. లక్షల్లో వసూలుకు పాల్పడే అంతరాష్ట్ర ముఠాను ఆదిలాబాద్ పోలీసులు అరెస్టు చేశారు. మంగళవారం ఎస్పీ అఖిల్ మహాజన్ మీడియా సమావేశంలో వివరాలు తెలిపారు. కర్ణాటకకు చెందిన 9 మంది ముఠాగా ఏర్పడి.. కొంత కాలంగా ఆదిలాబాద్ జిల్లాలో ఆయుర్వేద వైద్యం పేర పలువురిని మోసగించారు. ప్రధాన నిందితుడు కుమార్(బాబా) పరారీలో ఉండగా, మిగతా ముఠా సభ్యులు రెడ్ లైన్ శేఖర్, పెంద్రే కుమార్, గోలార్ సంతోష్, కొండంగల్ అమ్రేశ్, గోలార్ ఆనంద్, యలిగర్ హజ్రత్, నగేశ్, అనిల్ కుమార్ ను అరెస్టు చేసినట్లు చెప్పారు.
ఆదిలాబాద్ టౌన్ లో సాయి ఆయుర్వేదిక్ మెడిసిన్ షాప్ పేరిట నకిలీ ఆయుర్వేద మందులు అమ్ముతున్నారని తెలిపారు. ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రులు , సూపర్ మార్కెట్ల వద్ద అనారోగ్యంతో ఉన్నవారిని గుర్తించి ఆయుర్వేద మందులతో నయం చేస్తామని చెప్పి ఫోన్ నెంబర్లు తీసుకుంటున్నారు. తమకు ఇలాంటి సమస్య ఉండేదని, ఒక బాబా వద్దకు వెళ్తే నయమైదంటూ నమ్మిస్తున్నారు. ఇప్పటివరకు బాధితుల వద్ద రూ. లక్షల్లో వసూలు చేశారు.
చివరకు కొందరు బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసి, దర్యాప్తులో భాగంగా 8 మందిని అరెస్టు చేశారు. ప్రధాన నిందితుడు పరారీలో ఉన్నట్లు ఎస్పీ తెలిపారు. గతంలో వీరు సూర్యాపేట, ఖమ్మం, సిద్దిపేట జిల్లాల్లో ఇలాంటి మోసాలకు పాల్పడినట్లు చెప్పారు. ఆదిలాబాద్ డీఎస్పీ జీవన్ రెడ్డి, పట్టణ సీఐలు సునీల్ కుమార్, కరుణాకర్ రావు, కె. స్వామి ఉన్నారు.