గ్యాంగ్ రేప్ కేసులో బెయిల్.. కార్లతో నిందితుల విక్టరీ ర్యాలీ 

గ్యాంగ్ రేప్ కేసులో బెయిల్.. కార్లతో నిందితుల విక్టరీ ర్యాలీ 

బెంగళూరు: గ్యాంగ్ రేప్ కేసులో బెయిల్ పొందిన నిందితులు కార్లు, బైక్‎లతో రోడ్లపై ర్యాలీగా వెళ్తూ హల్​చల్​చేశారు. కర్నాటకలోని హవేరీ జిల్లా అక్కి అలూర్ పట్టణంలో ఈ ఘటన చోటుచేసుకుంది. ఈ ఊరేగింపు ర్యాలీకి సంబంధించిన వీడియో వైరల్​కావడంతో సోషల్​మీడియాలో తీవ్ర వివాదాస్పదమైంది. కర్నాటకలోని హవేరీలో గత సంవత్సరం ఓ మహిళపై కొందరు వ్యక్తులు సామూహిక అత్యాచారానికి పాల్పడిన ఘటన కలకలం రేపింది.

 2024 జనవరి 8న హనగల్ టౌన్‎లోని ఒక ప్రైవేట్ హోటల్‌లో ఓ జంట (26 ఏండ్ల మహిళ, 40 ఏండ్ల కర్నాటక రాష్ట్ర రోడ్ ట్రాన్స్‌పోర్ట్ కార్పొరేషన్ డ్రైవర్) ఉండగా.. నిందితులు దౌర్జన్యంగా వారి గదిలోకి చొరబడి.. ఆ మహిళను హోటల్ నుంచి సమీపంలోని అడవిలోకి లాక్కెళ్లి ఏడుగురు వ్యక్తులు ఆమెపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఆ తర్వాత బాధిత మహిళ ఫిర్యాదుతో విచారణ చేపట్టిన పోలీసులు.. ఏడుగురు ప్రధాన నిందితులతో సహా మొత్తం 19 మందిని అరెస్టు చేశారు. 

బాధితురాలు తొలుత నిందితులను గుర్తించినప్పటికీ.. కోర్టు విచారణ సమయంలో వారిని గుర్తుపట్టడటంలో ఇబ్బందిపడ్డారు. ఈ క్రమంలో నిందితుల్లోని 12 మంది పది నెలల క్రితం బెయిల్‎పై విడుదలయ్యారు. ప్రధాన నిందితులైన ఏడుగురికి మాత్రం ఇటీవలే బెయిల్ లభించింది. జైలు నుంచి బయటకు వచ్చిన నిందితులు.. రోడ్లపై కార్లు, బైక్‎ల మీద వేగంగా వెళ్తూ.. గట్టిగా అరుస్తూ విక్టరీ సింబల్​చూపుతూ ర్యాలీగా వెళ్లి హల్​చల్ చేశారు. ఆ వీడియోను చూసిన పలువురు నెటిజన్లు వారి తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దీనిపై పోలీసులు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.