
కరోనా లాక్ డౌన్ ఆంక్షల సడలింపు నేపథ్యంలో స్కూళ్లు రీ ఓపెన్ చేసేందుకు కర్ణాటక ప్రభుత్వం సిద్ధమైంది. కరోనా వైరస్ వ్యాప్తి కారణంగా గుంపులుగా చేరితే ఒకరి నుంచి మరొకరికి వేగంగా అంటుకునే ప్రమాదం ఉందని అకడమిక్ ఇయర్ పూర్తవడానికి ముందే స్కూళ్లు కాలేజీలు మూతపడ్డాయి. అయితే 2020-21 కొత్త విద్యా సంవత్సరం ప్రారంభంపై రెండ్రోజుల క్రితం సమీక్ష నిర్వహించిన కర్ణాటక ప్రభుత్వం దశల వారీగా స్కూళ్లు తెరవాలని నిర్ణయించింది. నాలుగో తరగతి నుంచి ఏడో తరగతి వరకు జూలై 1 నుంచి క్లాసులు మొదలు పెట్టాలని, ఒకటో తరగతి నుంచి మూడు వరకు, ఎనిమిదో తరగతి నుంచి టెన్త్ వరకు జూలై 15 నుంచి క్లాసులు స్టార్ట్ చేయాలని భావిస్తోంది. అయితే అన్ని క్లాసుల విద్యార్థులను ఒకే సమయంలో కాకుండా ఉదయం 8 నుంచి మధ్యాహ్నం 12 వరకు, మధ్యాహ్నం 1 నుంచి సాయంత్రం 5 గంటల వరకు వేర్వేరు తరగతుల పిల్లలు స్కూళ్లకు హాజరయ్యేలా చర్యలు తీసుకోవాలని విద్యా శాఖ యోచిస్తోంది. అయితే పేరెంట్స్, టీచర్ల నుంచి ఫీడ్ బ్యాక్ తీసుకుని తుది నిర్ణయంపై ప్రకటన విడుదల చేసే అవకాశం ఉందని తెలుస్తోంది.
ఇప్పటి వరకు దేశ వ్యాప్తంగా 2 లక్షల 8 వేలకు పైగా కరోనా కేసులు నమోదు కాగా.. కర్ణాటకలో 3,796 పాజిటివ్ కేసులు వచ్చాయి. ఆ రాష్ట్రంలో ఇప్పటికే 1,403 మంది కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. కరోనా కారణంగా 52 మంది మరణించారు. ప్రస్తుతం 2,339 మంది చికిత్స పొందుతున్నారు.