బియ్యం లేవు.. పైసలిస్తాం : కిలోకు రూ.34.. కర్నాటక సర్కార్ కీలక నిర్ణయం

బియ్యం లేవు.. పైసలిస్తాం : కిలోకు రూ.34.. కర్నాటక సర్కార్ కీలక నిర్ణయం

కర్నాటక ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.  ఎన్నికల మేనిఫెస్టోలో కేంద్రం ఉచితంగా ఇచ్చే ఐదు కిలోల బియ్యంతో పాటు పేదలకు అదనంగా నెలకు తాము మరో ఐదు కిలోల బియ్యం ఇస్తామని  కాంగ్రెస్  పార్టీ హామీ ఇచ్చింది. అయితే ఇప్పుడు అదనంగా బియ్యంకు బదులుగా నగదు ఇవ్వాలని నిర్ణయించింది.  బియ్యం కొనుగోలు చేసేవరకు ఎఫ్‌సిఐ (ఫుడ్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా) ప్రామాణికంగా కిలో బియ్యంకు గానూ రూ.34గా ఇస్తామని ప్రకటించింది.

2023జూన్ 28 బుధవారం రోజున సీఎం సిద్ధరామయ్య అధ్యక్షతన జరిగిన మంత్రివర్గ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు.  2023 జులై 1 నుంచి  బియ్యానికి బదులుగా నగదు పంపిణీ ప్రారంభమవుతుందని కిలో బియ్యం రూ.34గా ఇస్తామని పౌర సరఫరాల శాఖ మంత్రి కెహెచ్ మునియప్ప వెల్లడించారు. 

తాము బియ్యం కోసం ప్రయత్నించాము, కాని తమకు అవసరమైన బియ్యం  సరఫరా చేయడానికి ఏ సంస్థ ముందుకు రాలేదన్నారు మునియప్ప .  ఈ డబ్బును  నేరుగా లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేసేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేసిందని ఆయన తెలిపారు. కేంద్ర ప్రభుత్వ పథకం కింద బియ్యం కొనుగోలు యథాతథంగా కొనసాగుతుందని మంత్రి స్పష్టం చేశారు.  

ఒక కుటుంబానికి 5 కిలోలు, ఇద్దరు సభ్యుల కుటుంబానికి 10 కిలోలు, ఐదుగురు సభ్యుల కుటుంబానికి 25 కిలోల బియ్యం కేటాయించినట్లు మంత్రి వివరించారు. అదే లెక్కన కిలో బియ్యం రూ.34, 5 కిలోల బియ్యం పొందుతున్న కుటుంబానికి రూ.150, 10 కిలోల బియ్యం అందుతున్న కుటుంబానికి రూ.340. అలాగే 25 కిలోల బియ్యం పొందే కుటుంబానికి రూ.850 అందజేస్తామని మంత్రి వివరించారు.

బియ్యానికి బదులు నగదు ఇవ్వాలన్న నిర్ణయం తాత్కాలికమేనని మునియప్ప తెలిపారు. బియ్యం సేకరణను ప్రభుత్వం కొనసాగిస్తుందని. సరిపడా బియ్యం అందుతాయని నిర్ధారించుకున్న తర్వాత డబ్బుకు బదులు బియ్యం ఇస్తుందని తెలిపారు . అయితే అప్పటి వరకు బియ్యం బదులు డబ్బులు ఇవ్వాలని నిర్ణయించామని తెలిపారు.