కర్ణాటక హిజాబ్ వివాదం: హైకోర్టు విచారణ వాయిదా

కర్ణాటక హిజాబ్ వివాదం: హైకోర్టు విచారణ వాయిదా

కర్ణాటకలో హిజాబ్ వివాదంపై ఆ రాష్ట్ర హైకోర్టు త్రిసభ్య ధర్మాసనం ఇవాళ మధ్యాహ్నం విచారణ చేపట్టింది. ప్రస్తుతానికి కాలేజీలు రీ ఓపెన్ చేసుకోవచ్చని చెప్పిన సీజే బెంచ్‌.. విద్యార్థులెవరూ మతపరమైన దుస్తులను ధరించకూడదని ఆదేశించింది. తమ విచారణ పూర్తయి ఈ అంశంలో ఒక క్లారిటీ వచ్చే వరకూ ఈ ఆదేశాలు వర్తిస్తాయని స్పష్టం చేసింది. అయితే శాంతి, సామరస్యాలు నెలకొనేలా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వానికి హైకోర్టు సూచించింది. తదుపరి విచారణను ఫిబ్రవరి 14 మధ్యాహ్నం 2.30 గంటలకు వాయిదా వేసింది.

కొద్ది రోజుల క్రితం కర్ణాటకలోని ఉడుపిలోని ఓ ప్రభుత్వ కాలేజీకి కొంత మంది విద్యార్థినులు హిజాబ్ వేసుకుని రావడంపై అధికారులు అభ్యంతరం తెలిపారు. కాలేజీకి ప్రతి ఒక్కరూ యూనిఫామ్ మాత్రమే వేసుకుని రావాలని సూచించారు. హిజాబ్ ధరించి వచ్చిన ముస్లిం విద్యార్థినులను అడ్డుకోవడంతో వాళ్లు నిరసనలు చేపట్టారు. దీనిపై క్రమంగా పరస్పర నిరసనల వరకూ దారితీయడంతో శాంతి భద్రతల సమస్య ఏర్పడుతుందని కర్ణాటక సర్కారు విద్యా సంస్థలకు సెలవులు ప్రకటించింది. అయితే హిజాబ్ ధరించడం తమ హక్కు అని, ప్రభుత్వం డ్రస్సింగ్ విషయంలో ఇచ్చిన ఉత్తర్వులను వెనక్కి తీసుకునేలా ఆదేశించాలని కోరుతూ కొందరు విద్యార్థినులు కర్ణాటక హైకోర్టును ఆశ్రయించారు. దీంతో వారి పిటిషన్‌పై ఇవాళ హైకోర్టు చీఫ్​ జస్టిస్ రితు రాజ్ అవస్తీ, జస్టిస్ కృష్ణ దీక్షిత్, జస్టిస్ జైమున్నిస్సా ఎం ఖాజీలతో ధర్మాసనం గురవారం మధ్యాహ్నం విచారణ చేపట్టింది.

సీఎం సమావేశం తర్వాత నిర్ణయం

కోర్టు ఆర్డర్ కాపీ అందిన తర్వాత దానిని పరిశీలించి సీఎం బసవరాజ్ బొమ్మై రివ్యూ సమావేశం నిర్వహిస్తారని కర్ణాటక విద్యా శాఖ మంత్రి బీసీ నగేశ్ తెలిపారు. స్కూళ్లు, కాలేజీలు తెరవడంపై ఈ సమావేశంలో నిర్ణయించనున్నట్లు చెప్పారు.

మరిన్ని వార్తల కోసం..

నలుగురు రైతుల్ని చంపినోడికి నాలుగు నెలల్లో బెయిలా?

పదేళ్లుగా సర్కారుకు కిరాయి కట్టని కాంగ్రెస్

ఇక తిరుపతిలో నేరుగా సర్వదర్శనం టోకెన్ల జారీ