సినిమా టికెట్లపై 200 రూపాయల రూల్పై హైకోర్టు స్టే.. ‘కాంతారా’ చాప్టర్ 1 సినిమాకు ఊరట

సినిమా టికెట్లపై 200 రూపాయల రూల్పై హైకోర్టు స్టే.. ‘కాంతారా’ చాప్టర్ 1 సినిమాకు ఊరట

బెంగళూరు: సినిమా టికెట్ ధర 200 రూపాయలకు మించకూడదన్న కర్నాటక ప్రభుత్వ నిబంధనపై కర్ణాటక హైకోర్టు స్టే విధించింది. ప్రభుత్వం ఇచ్చిన ఈ ఆదేశాలను తాత్కాలికంగా సస్పెండ్ చేసింది. మల్లీప్లెక్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియాతో పాటు సినీ పరిశ్రమకు చెందిన కొందరు సినీ నిర్మాతలు దాఖలు చేసిన పిటిషన్లపై విచారించిన హైకోర్టు మంగళవారం ఈ నిర్ణయాన్ని వెలువరించింది. జస్టిస్ రవి వి హోస్మానీ ఈ పిటిషన్లపై సుదీర్ఘంగా వాదనలు విన్నారు. సినిమా టికెట్ ధర 200 రూపాయలకు మించకూడదన్న ప్రభుత్వ ఆదేశాలపై స్టే విధిస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేశారు.

సెప్టెంబర్ 23 నుంచే హైకోర్టు ఆర్డర్ అమల్లోకి వస్తుందని ఆయన స్పష్టం చేశారు. సీనియర్ అడ్వకేట్ ముకుల్ రోహత్గి పిటిషనర్ల తరపు వాదనలు వినిపిస్తూ.. 2017 ఏప్రిల్లో కూడా సినిమా టికెట్ల ధర 200 రూపాయలకు మించకూడదని అప్పటి ప్రభుత్వం రూల్ విధించిందని, ఆ తర్వాత నిర్ణయాన్ని ఉపసంహరించుకుందని న్యాయస్థానం దృష్టికి తీసుకొచ్చారు. కర్ణాటక సినిమా రెగ్యులేషన్ యాక్ట్ గురించి కూడా కోర్టుకు వివరిస్తూ.. సినిమా టికెట్ ధరలపై పరిమితి విధించే అధికారం ప్రభుత్వానికి లేదని చెప్పారు.

సినిమా హాళ్ల నిర్మాణానికి, నిర్వహణకు మల్టీప్లెక్స్లు కోట్లలో ఖర్చు పెడుతున్నాయని.. ప్రభుత్వం తీసుకొచ్చిన ఈ రూల్ వల్ల సినిమా థియేటర్ల ఓనర్లు నష్టపోతున్నారని తెలిపారు. కాంతార సినిమా ప్రొడక్షన్ సంస్థ కూడా ప్రభుత్వం విధించిన 200 రూపాయల ఫిక్డ్స్ టికెట్ రూల్ పై కోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే. అక్టోబర్ 2న దసరా సందర్భంగా ‘కాంతారా’ చాప్టర్ 1 సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది. ప్రభుత్వం తీసుకొచ్చిన ఈ 200 రూపాయల ఫిక్డ్స్ టికెట్ రూల్ వల్ల నష్టపోతామని భావించిన ‘కాంతారా’ సినిమా నిర్మాతలు కర్నాటక హైకోర్టులో వ్యాజ్యం దాఖలు చేశారు. హైకోర్టు తాజా నిర్ణయంతో ‘కాంతారా’ చాప్టర్ 1 సినిమాకు లైన్ క్లియర్ అయింది.