కర్ణాటకలో కరోనా అనుమానితుడి మృతి

కర్ణాటకలో కరోనా అనుమానితుడి మృతి

కర్ణాటకలో కరోనా వచ్చిందన్న అనుమానంతో ఆస్పత్రిలో చేరిన 76 ఏళ్ల వృద్ధుడు ప్రాణాలు కోల్పోయాడు. అయితే అతడి టెస్టు రిపోర్టులు ఇంకా రావాల్సి ఉంది. ఒక వేళ టెస్టుల్లో పాజిటివ్ వస్తే.. భారత్‌లో కరోనా వైరస్ కారణంగా ఇదే తొలి మృతిగా నమోదవుతుంది.

కలుబుర్గి ప్రాంతానికి చెందిన మహ్మద్ హుసేన్ సిద్ధిఖ్ (76) అనే వృద్ధుడు ఇక్కడి ఆస్పత్రిలో జలుగు, దగ్గు, ఊపిరాడకపోవడం లాంటి లక్షణాలతో అడ్మిట్ అయ్యాడు. అతడి శాంపిల్స్ సేకరించిన డాక్టర్లు బెంగళూరు మెడికల్ కాలేజ్ అండ్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్‌కు పంపారు. అక్కడి వైరస్ రీసెర్చ్ అండ్ డయాగ్నొస్టిక్ ల్యాబొరేటరీలో టెస్టులు చేసి, రిపోర్టులు పంపాల్సి ఉంది. ఈ లోపే సిద్ధిఖ్ బుధవారం మరణించారు. అయితే దీన్ని కరోనా వైరస్ కారణంగా సంభవించిన మరణమని అప్పుడే చెప్పలేమని కర్ణాటక ఆరోగ్య శాఖ అధికారులు చెప్పారు.

సిద్ధిఖ్‌ లక్షణాల ఆధారంగా మూడు రోజుల పాటు చికిత్స అందించామని చెప్పారు కలబుర్గి అధికారులు. అయితే అతడిని కుటుంబసభ్యులు హైదరాబాద్‌కు తీసుకెళ్లారని తెలిపారు. అక్కడి నుంచి తిరిగి వస్తుండగా అంబులెన్స్‌లోనే సిద్ధిఖ్ మరణించాడని చెప్పారు. రిపోర్ట్స్ వస్తే కానీ, కరోనా వల్ల చనిపోయాడా లేక మరేదైనా కారణమా అని చెప్పలేమని వారు వివరిస్తున్నారు.