కర్ణాటక రాజకీయాల్లో మే 28న ఊహించని భారీ కుదుపు చోటుచేసుకుంది. కాంగ్రెస్ హైకమాండ్ పవర్ షేరింగ్ ఫార్ములా ప్రకారం సీఎం సిద్ధరామయ్య తన పదవికి రాజీనామా చేసేశారు. అయితే ఈ పొలిటికల్ హైడ్రామా బెంగళూరు అసెంబ్లీని ఎంతగా కుదిపేసిందో కానీ.. దలాల్ స్ట్రీట్‌లోని ఒక స్టాక్‌కు మాత్రం నెక్ట్స్ లెవెల్ బూస్ట్ ఇచ్చింది. సిద్ధరామయ్య సీటు ఖాళీ అవ్వడం ఆలస్యం.. ‘కెఫే కాఫీ డే’ కంపెనీ షేర్లు శుక్రవారం ట్రేడింగ్‌లో ఏకంగా 20 శాతం పెరిగి అప్పర్ సర్క్యూట్‌ను తాకాయి. గత ఐదు సెషన్లలో ఈ షేరు విలువ ఏకంగా 41 శాతం దూసుకెళ్లడం ఇన్వెస్టర్లకు కనకవర్షం కురిపించింది.
రాజకీయాల్లో మార్పు వస్తే కాఫీ పొడి షేర్లకు అంత సీన్ ఏంటా అని అనుకుంటున్నారా? అక్కడే ఉంది అసలైన ట్విస్ట్. కర్ణాటక తర్వాతి సీఎం కాంగ్రెస్ ట్రబుల్ షూటర్ డీకే శివకుమార్ పగ్గాలు చేపట్టబోతున్నారనే ప్రచారం గట్టిగా సాగుతోంది. ఈ డీకే శివకుమార్‌కు, సీసీడీ యజమానులకు మధ్య చాలా బలమైన బంధుత్వం ఉంది. కాఫీడే దివంగత వ్యవస్థాపకుడు వీజీ సిద్ధార్థ కుమారుడు అమర్త్య హెగ్డేకు.. డీకే శివకుమార్ కుమార్తె ఐశ్వర్యను ఇచ్చి వివాహం జరిపించారు. అంటే కాబోయే సీఎం డీకే శివకుమార్.. సీసీడీ వారసుడికి స్వయానా మామగారన్నమాట. కర్ణాటకలో ఇక డీకే శివకుమార్ హవా నడవబోతుండటంతో సంస్థకు మంచి రోజులొస్తాయనే ఆశతో ఇన్వెస్టర్లు ఎగబడి మరీ షేర్లను కొనేశారు. దీంతో ఒక్కో షేరు ధర రూ.34.78కి జంప్ చేసింది.
మరోవైపు ఢిల్లీలో కాంగ్రెస్ హైకమాండ్ పొలిటికల్ ఈక్వేషన్లను సెట్ చేసే పనిలో బిజీగా ఉంది. కేవలం సీఎం మార్పు మాత్రమే కాకుండా.. 2028 అసెంబ్లీ ఎన్నికలను మైండ్‌లో పెట్టుకుని 'కేరళ మోడల్' తరహాలో క్యాబినెట్‌ను పూర్తిగా ప్రక్షాళన చేయాలని రాహుల్ గాంధీ, ఖర్గే భావిస్తున్నారు. సీనియర్లతో పాటు యువతకు చోటు కల్పించబోతున్నారు. ఇక్కడే సిద్ధరామయ్య హైకమాండ్ ముందు ఒక క్రేజీ కండిషన్ పెట్టారు. తాను కుర్చీ దిగడానికి ఓకే కానీ.. తన కుమారుడు యతీంద్ర సిద్ధరామయ్యకు డిప్యూటీ సీఎం పదవి ఇవ్వాలని డిమాండ్ చేసినట్లు వార్తలు వస్తున్నాయి. మరి ఈ పొలిటికల్ కాఫీ కాక ఇంకెన్ని మలుపులు తిరుగుతుందో చూడాల్సిందే అంటున్నారు మార్కెట్ నిపుణులు.
