నెగిటివ్ వచ్చినా 7 రోజులు హోం క్వారంటైన్..

నెగిటివ్ వచ్చినా 7 రోజులు హోం క్వారంటైన్..

ప్రపంచ దేశాలను ఒమిక్రాన్ భూతం వెంటాడుతోంది. కొత్త వేరియెంట్ వేగంగా వ్యాపించే అవకాశముండటంతో దాని కట్టడికి ప్రభుత్వాలు తీవ్రంగా శ్రమిస్తున్నాయి. కేసుల సంఖ్య పెరగకుండా కర్నాటక సర్కారు ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటోంది. ఇందులో భాగంగా ఒమిక్రాన్ వేరియెంట్ సోకిన కోవిడ్ పేషంట్ల డిశ్చార్జ్ కు సంబంధించి ఆ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ కొత్త మార్గదర్శకాలు జారీ చేసింది. 
భారత్ లో ఒమిక్రాన్ వేరియెంట్ సోకిన తొలి రెండు కేసులు కర్నాటకలోనే నమోదయ్యాయి. కొత్త రకం కరోనా సోకిన పేషెంట్లలో ఒకరు 66 ఏళ్ల విదేశీయుడు కాగా.. మరొకరు బెంగళూరుకు చెందిన డాక్టర్. అయితే వీరిలో సదరు విదేశీయుడు ఓ ప్రైవేట్ ల్యాబ్ నుంచి నెగిటివ్ రిపోర్ట్ సంపాదించి దేశం విడిచి వెళ్లిపోయాడు. ఒమిక్రాన్ సోకిన డాక్టర్ కు సైతం నెగిటివ్ రావడంతో హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ చేశారు. రెండోసారి ఆర్టీ పీసీఆర్ పరీక్షించగా ఆయనకు మళ్లీ పాజిటివ్ గా తేలింది. ఈ రెండు ఘటనలతో అప్రమత్తమైన కర్నాటక ఆరోగ్య శాఖ డిశ్చార్జ్ రూల్స్ లో మార్పు చేసింది. 

కర్నాటక ఆరోగ్య శాఖ జారీ చేసిన కొత్త మార్గదర్శకాల ప్రకారం..
సాధారణ లక్షణాలు ఉన్న కరోనా పేషెంట్లను 10 రోజుల తర్వాత డిశ్చార్జ్ చేయవచ్చు. అయితే డిశ్చార్జ్ కు 3 రోజుల  ముందు నుంచి పేషెంట్ లో కోవిడ్ కు సంబంధించి ఎలాంటి లక్షణాలు కనిపించకూడదు.
-వరుసగా నాలుగు రోజుల పాటు ఆక్సిజన్ లెవెల్స్ 95శాతానికి పైగా నమోదై ఉండాలి.
-24 గంటల వ్యవధిలో రెండుసార్లు ఆర్టీ - పీసీఆర్ టెస్ట్ నిర్వహించాలి. రెండు రిపోర్టులు నెగిటివ్ రావాలి. 
- పేషెంట్ హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయిన తర్వాత 7 రోజుల పాటు హోం క్వారంటైన్ లో ఉండాలి. 
-హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయిన ఆరు రోజుల తర్వాత నిర్వహించే ఆర్టీ పీసీఆర్ టెస్ట్ లో నెగిటివ్ వస్తే వారు హోం క్వారంటైన్ నుంచి బయటకు రావచ్చు. 
ఈ ప్రొటోకాల్ ను ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ప్రభుత్వం ప్రకటించింది.