వైసీపీ సర్కారుకు పుట్టగతులుండవు: కాసాని జ్ఞానేశ్వర్​

వైసీపీ సర్కారుకు పుట్టగతులుండవు: కాసాని జ్ఞానేశ్వర్​

హైదరాబాద్, వెలుగు: నారా చంద్రబాబు నాయుడు అరెస్టు దుర్మార్గమని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్‌‌‌‌ అన్నారు. సోమవారం చంద్రబాబు అరెస్టును ఖండిస్తూ  ఎన్టీఆర్ భవన్ లో  నిరాహార దీక్ష కార్యక్రమాన్ని చేపట్టారు. దీక్షకు ముందు ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళు అర్పించారు. ఎన్టీఆర్ కుటుంబ సభ్యులు కూడా దీక్షలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా కాసాని మాట్లాడుతూ.. చంద్రబాబు, నారా లోకేశ్ చేపట్టిన పాదయాత్ర, సభలకు లక్షలాది మంది ప్రజలు స్వచ్ఛందంగా రావడాన్ని వైసీపీ తట్టుకోలేకపోతున్నదని తెలిపారు. అందుకే  అక్రమ అరెస్టు చేశారని ఆరోపించారు.  తప్పుడు కేసులతో అక్రమంగా అరెస్టు చేసి జైలులో పెట్టారని.. అందుకే మహాత్మా గాంధీ జయంతి రోజున  నిరసన దీక్ష చేపట్టినట్లు కాసాని చెప్పారు. రాబోయే  రోజులలో వైసీపీ ప్రభుత్వానికి పుట్టగతులు ఉండవు అని ఫైర్ అయ్యారు. 

రాజ్యాంగాన్ని ఉల్లంఘించారు: సుహాసిని

రాజ్యాంగాన్ని ఉల్లంఘించి చంద్రబాబును అరెస్ట్ చేశారని నందమూరి సుహాసిని ఆరోపించారు. ఎఫ్ఐఆర్ లో ఎలాంటి ఆధారాలు లేవని..అయినా ఆయన 23 రోజులుగా జైల్లోనే ఉన్నారని అన్నారు. ఇటీవల నారా లోకేశ్ కు కూడా సమన్లు పంపించారని..అతడిని కూడా జైలుకు పంపించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని  వివరించారు."తెలుగు ప్రజలందరూ చూస్తున్నారు. భవిష్యత్తులో గట్టి  సమాధానం ఉంటుంది. జాగ్రత్త!" అంటూ హెచ్చరించారు.  బాలకృష్ణ సతీమణి నందమూరి వసుంధర మాట్లాడుతూ.. మహాత్మాగాంధీ జయంతి రోజున చేస్తున్న ఈ దీక్షతో  న్యాయం గెలిచి తీరుతుందని నమ్ముతున్నట్లు చెప్పారు.  పొలిట్ బ్యూరో సభ్యుడు అరవింద్ కుమార్ గౌడ్ మాట్లాడుతూ.. చంద్రబాబు అక్రమ అరెస్టుపై కేసీఆర్ స్పందించాలన్నారు. కార్యక్రమంలో చిలువేరు కాశీనాథ్,  బంటు వెంకటేశ్వర్లు, ప్రసూన, పుల్లయ్య పాల్గొన్నారు.