కాశీబుగ్గలో తొక్కిసలాట.. 9 మంది మృతి.. ఏపీలోని శ్రీకాకుళం జిల్లాలో ఘటన

కాశీబుగ్గలో తొక్కిసలాట.. 9 మంది మృతి.. ఏపీలోని శ్రీకాకుళం జిల్లాలో ఘటన
  • మృతుల్లో 13 ఏండ్ల బాలుడు, 8 మంది మహిళలు 
  • మరో 16 మందికి గాయాలు.. ముగ్గురికి సీరియస్
  • ఏకాదశి సందర్భంగా వేంకటేశ్వర స్వామి గుడికి పోటెత్తిన భక్తులు 
  • మెట్ల మార్గంలో ఉన్న రెయిలింగ్ విరిగిపోవడంతో ప్రమాదం 
  • మృతుల కుటుంబాలకు రూ. 15 లక్షల చొప్పున, 
  • గాయపడినోళ్లకు రూ. 3 లక్షల చొప్పున ఏపీ సర్కార్ పరిహారం

ఏపీలోని శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గలో ఘోరం జరిగింది. ఇక్కడి వేంకటేశ్వర స్వామి ఆలయంలో తొక్కిసలాట చోటుచేసుకుని, 9 మంది భక్తులు చనిపోయారు. వీరిలో 13 ఏండ్ల బాలుడు, 8 మంది మహిళలు ఉన్నారు. మరో 16 మందికి గాయాలయ్యాయి. వారిలో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉంది. కాశీబుగ్గలో ఆలయ ధర్మకర్త హరిముకుంద్‌పండా 12 ఎకరాల తన సొంత భూమిలో రూ.20 కోట్లతో వేంకటేశ్వర స్వామి గుడి నిర్మించారు. ఆలయంలో ఈ ఏడాది మే నుంచి దర్శనాలు ప్రారంభమయ్యాయి. 

ప్రతి శనివారం  భారీగా భక్తులు వస్తుంటారు. ఈ శనివారం ఏకాదశి కావడంతో భక్తులు అధిక సంఖ్యలో వచ్చారు. ఈ క్రమంలో భక్తులు మెట్లు ఎక్కి ఆలయం లోపలికి వెళ్లే మార్గంలో ఉన్న రెయిలింగ్ 
విరిగిపోవడంతో తొక్కిసలాట జరిగింది.‘‘ఆలయానికి 15 వేల మంది భక్తులు వచ్చారు. రెయిలింగ్‌‌ విరిగిపోవడంతో తొక్కిసలాట చోటుచేసుకుంది. 

ఘటనా స్థలంలోనే ఏడుగురు చనిపోయారు. పలాస ఆస్పత్రిలో ట్రీట్‌‌మెంట్ పొందుతూ మరో ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనలో 16 మందికి గాయాలయ్యాయి. వాళ్లందరికీ పలాస ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నాం. బాధితుల్లో ముగ్గురి కండీషన్ సీరియస్‌‌గా ఉంది” అని ఏపీ ప్రభుత్వం ప్రకటనలో పేర్కొంది.

 కాగా, మృతులను టెక్కలి మండలం రామేశ్వరానికి చెందిన చిన్నమ్మి (50), పట్టిలసారి గ్రామానికి చెందిన రాపాక విజయ (48), వజ్రపుకొత్తూరు మండలానికి చెందిన నీలమ్మ (60), మందసకు చెందిన రాజేశ్వరి (60), బృందావతి (62), నందిగాం మండలానికి చెందిన యశోదమ్మ (56), సోంపేటకు చెందిన నిఖిల్‌‌ (13), పలాసకు చెందిన అమ్ముడమ్మతో పాటు రూప అనే మరో మహిళగా గుర్తించారు. 

విచారణకు ఆదేశం.. 

కాశీబుగ్గ ఘటనపై రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధాని మోదీ, కేంద్రమంత్రులు అమిత్ షా, రామ్మోహన్ నాయుడు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు రూ.2 లక్షల చొప్పున, గాయపడినోళ్లకు రూ.50 వేల చొప్పున పరిహారం అందజేయనున్నట్టు ప్రధానమంత్రి కార్యాలయం ప్రకటించింది. తొక్కిసలాట ఘటన తనను తీవ్రంగా కలచివేసిందని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు.

 ‘‘ఈ దురదృష్టకర ఘటనలో భక్తులు మరణించడం విషాదకరం. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను. గాయపడినవారికి మెరుగైన వైద్యం అందించాలని అధికారులను ఆదేశించాను. ఘటనా స్థలానికి వెళ్లి సహాయక చర్యలు చేపట్టాలని స్థానిక అధికారులు, ప్రజాప్రతినిధులను కోరాను’’ అని తెలిపారు. 

ఘటనా స్థలాన్ని మంత్రి నారా లోకేశ్ పరిశీలించారు. పలాస ఆస్పత్రిలో ట్రీట్‌‌మెంట్ పొందుతున్న బాధితులను పరామర్శించారు. బాధిత కుటుంబాలను ఆదుకుంటామని చెప్పారు. మృతుల కుటుంబాలకు రూ.15 లక్షల చొప్పున, గాయపడినోళ్లకు రూ.3 లక్షల చొప్పున ఆర్థిక సాయం అందజేస్తామని ప్రకటించారు. 

ఇలాంటి ఘటనలు మళ్లీ జరగకుండా చర్యలు తీసుకుంటామన్నారు. తొక్కిసలాట ఘటనపై సమగ్ర విచారణకు ఆదేశించినట్టు రాష్ట్ర హోంమంత్రి అనిత తెలిపారు. తొక్కిసలాట ఘటన జరగడం దురదృష్టకరమని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ అన్నారు. 

ఇంతమంది వస్తరనుకోలేదు: హరిముకుంద్‌‌ పండా 

తొక్కిసలాట ఘటనపై ఆలయ నిర్వాహకుడు హరిముకుంద్‌‌ పండా స్పందించారు. సాధారణంగా ఆలయానికి రోజూ  రెండు వేల మంది వరకు భక్తులు వస్తుంటారని, ఇంత పెద్ద సంఖ్యలో వస్తారని ఊహించలేదని తెలిపారు.