కాసిపేట ‘ఓరియంట్’ ఎన్నికల్లో హోరాహోరీ

కాసిపేట ‘ఓరియంట్’ ఎన్నికల్లో హోరాహోరీ

కాసిపేట, వెలుగు: మంచిర్యాల జిల్లా కాసిపేట మండలంలోని ఓరియంట్​సిమెంట్(అదానీ) కంపెనీలో గుర్తింపు కార్మిక సంఘం ఎన్నికలు హోరాహోరీగా మారాయి. మొత్తం 257 మంది ఓటర్లు ఉన్నారు. కాంగ్రెస్​నుంచే ఇద్దరు అభ్యర్థులు పోటీ పడుతుండడంతో ప్రాధాన్యత సంతరించుకుంది. ఓరియంట్ సిమెంట్​స్టాఫ్​అండ్​వర్కర్స్​ఫెడరేషన్ తరఫున కె.సత్యపాల్​రావు, సిమెంట్​కార్మిక సంఘం తరఫున పి.విక్రమరావు బరిలో నిలిచారు. మరో సంఘం తరఫున గిరిజన నేత టి.భీంరావు కూడా పోటీలో ఉన్నారు. ఒకే పార్టీ నుంచి ఇద్దరు పోటీపడుతుండడంతో పరోక్షంగా అధికార పార్టీ ప్రజాప్రతినిధులు పావులు కదుపుతున్నట్లు ప్రచారంలో ఉంది. వారం రోజులుగా ఎన్నికల్లో  తమ అభ్యర్థులను గెలిపించుకోవడానికి తాయిలాలు మొదలు పెట్టారు. 

ఇప్పటికే ఒక వర్గం నేతలు ఓటర్లను ప్రలోభపెట్టి ప్రత్యేక శిబిరానికి తరలించినట్లు తెలుస్తోంది. వారికి రోజువారి వేతనం, ఖర్చులు ఇవ్వడంతో పాటు అన్ని వసతులు కల్పించి డబ్బులు కూడా ముట్టచెప్పినట్లు సమాచారం. ఇందుకు దీటుగా ప్రత్యర్థిగా ఉన్న మరో అభ్యర్థి తరఫున కూడా గెలుపు కోసం నేతలు రంగంలోకి దిగారు. మంగళవారం నుంచే ప్రణాళిక అమలులో నిమగ్నమయ్యారు. దీంతో ఓరియంట్​సిమెంట్​గుర్తింపు కార్మిక సంఘం ఎన్నికలు స్థానికంగా చర్చనీయాంశంగా మారాయి. 

తమ అభ్యర్థుల గెలుపు కోసం బడానేతలు తెరవెనుక వేసే ప్రణాళికలు ఫలించి ఎవరికి కార్మికులు పట్టం కడతారోననే ఆసక్తి నెలకొంది. ఈనెల 29న ఉదయం నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు పోలింగ్ జరుగుతుంది. అనంతరం ఓట్ల లెక్కింపు చేపట్టి సాయంత్రం కల్లా ఫలితాలు ప్రకటిస్తారు. ఇందుకు సంబంధిత అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.  

ఎవరినీ నమ్మి ఓట్లు వేయొద్దు ఎమ్మెల్యే గడ్డం వినోద్​

 ఓరియంట్​కంపెనీలో జరిగే గుర్తింపు కార్మిక సంఘం ఎన్నికల్లో ఎవరినీ నమ్మి ఓట్లు వేయవద్దని ఎమ్మెల్యే గడ్డం వినోద్​సూచించారు. కార్మికుల కోసం తమ కుటుంబం ఎన్నో త్యాగాలు చేసిందన్నారు. ఎవరు గెలిస్తే కంపెనీ కార్మికులకు లాభం జరుగుతుందో గుర్తుంచుకోవాలన్నారు.  అవసరమైతే అదానీ, ప్రధాని  మోదీతో కూడా మాట్లాడి సమస్యలు పరిష్కరిస్తామన్నారు. విక్రమ్​ను గెలిపించాలని ఆయన కోరారు. నేతలు ఎం. సూరిబాబు, విక్రమ్​, ప్రదీప్​ తదితరులు పాల్గొన్నారు. 

కాంట్రాక్ట్ లోడింగ్ కార్మికుల ధర్నా

దేవాపూర్ ఓరియంట్ సిమెంట్ ఫ్యాక్టరీలోని కాంట్రాక్ట్ లోడింగ్ కార్మికులు మంగళవారం విధులు బహిష్కరించి  ధర్నా చేశారు. పలువురు కార్మికులు మాట్లాడుతూ.. ఓరియంట్ సిమెంట్ కంపెనీని అదానీ  తీసుకున్నప్పటి నుంచి వేధింపులు మొదలయ్యాయని వర్క్ క్యాలెండర్ చేసి తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కాంట్రాక్టు విధానాన్ని తీసివేసి,  పర్మినెంట్ కార్మికుల మాదిరిగానే లోడింగ్ కార్మికులను పర్మినెంట్ చేస్తూ అన్ని రకాల బెనిఫిట్స్ కల్పిలంచాలని డిమాండ్ చేశారు.  యాజమాన్యం దిగివచ్చే దాకా ఆందోళన చేపడతామని హెచ్చరించారు.