ఈ పక్షి.. చాలా డేంజర్!

ఈ పక్షి.. చాలా డేంజర్!
  • యజమానిని చంపేసిన కాసోవరీ

ఆరడుగుల ఎత్తు. ఒళ్లంతా నల్లటి జుట్టు. నీలి రంగు మెడ. చూడ్డానికి ముచ్చటగా, అందంగా కనిపించినా చాలా చాలా డేంజర్ పక్షి ఈ కాసోవరీ. నిప్పుకోడి (ఆస్ట్రిచ్ ), ఈము జాతికి చెందిన పక్షి. దాని కాళ్ల గోర్లు రెండు అంగుళాలుంటాయి. మనిషి కనిపిస్తే చాలు దాడి చేసేస్తుంది. ఎగిరి తన్నిందంటే ఆ గోళ్లు ఒంట్లోకి దిగబడిపోతాయి. దాని గురించి ఇప్పుడెందుకంటే.. అమెరికాలోని ఫ్లోరిడాకు చెందిన ఓ వ్యక్తిని దాడి చేసి చంపేసింది. మార్విన్ హాజోస్ అనే 75 ఏళ్ల వ్యక్తి ముచ్చటపడి దానిని తన పెరట్లో పెంచుతున్నాడు. మరి, దానికి కోపమెక్కడ వచ్చిందో తెలియదు గానీ, పెరట్లో అతడిపై దాడి చేసి తీవ్రంగా గాయపరిచింది.

ఇంట్లోవాళ్లు ఆస్పత్రికి తీసుకెళ్లినా ఫలితం లేకపోయింది. అధికారులు ఆ పక్షిని స్వాధీనం చేసుకుని జూకు తరలించారు. క్లాస్ 2 వైల్డ్ లైఫ్ పక్షిగా పేర్కొనే కాసోవరీని.. కొనడంగానీ, అమ్మడంగానీ నిషిద్ధమని అధికారులు అంటున్నారు. జూలో ఆ పక్షులను సంరక్షించే జూ కీపర్లే చాలా జాగ్రత్తగా వెళుతుంటారని చెప్పారు. ఇవి ఎక్కువగా న్యూగినీ, ఆస్ట్రేలియాలోని క్వీన్స్ లాండ్ లో ఉంటాయని వాషింగ్టన్ లోని నేషనల్ జూ అసిస్టెంట్ క్యూరేటర్ ఎరిక్ స్లో వాక్ చెప్పారు.

తడి అడవుల్లో ఎక్కడో లోపల ఇవి ఉంటాయని, జనానికి కనిపించడం చాలా అరుదని, పండ్లు తిని బతుకుతాయని అన్నారు. జూలో వాటికి సంబంధించిన ఎన్ క్లోజర్స్ విషయంలో చాలా జాగ్రత్తగా ఉంటామన్నారు. చివరిసారి 1926లో దీని దాడికి ఓ వ్యక్తి చనిపోయాడు. అప్పట్నుంచి ఇలా దాని దాడిలో చనిపోవడం ఇదే తొలిసారి. ఏటా ఆస్ట్రేలియాలో వందలాది మందిపై కాసోవరీలు దాడి చేస్తున్నాయని ఇటీవలి స్టడీల్లో తేలింది. 2012లో డెన్నిస్ వార్డ్ అనే ఓ టూరిస్టును ఎగిరి తన్నడంతో వాటర్ ఫాల్స్ పై నుంచి పడిపోయాడు.