2లక్షలు లంచం తీసుకుంటూ దొరికిపోయిన ఎమ్మార్వో

2లక్షలు లంచం తీసుకుంటూ దొరికిపోయిన ఎమ్మార్వో

జయశంకర్ భూపాలపల్లి జిల్లా: రైతును 5 లక్షలు లంచం అడిగిన ఎమ్మార్వో బేరమాడితే రూ.3లక్షలు తీసుకునేందుకు ఒప్పుకుని లంచం డబ్బు తీసుకుంటూ అవినీతి నిరోధక శాఖ అధికారులకు దొరికిపోయింది. జిల్లాలోని కాటారం తాహశీల్దార్ కార్యాలయంలో స్వయంగా ఎమ్మార్వోనే లంచం తీసుకోగా ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. రైతు ఐత హరికృష్ణ కొత్తపల్లి శివారులోని భూమి సర్వే నెంబర్ 3కు ఆన్ లైన్ చేసి పట్టా ఇచ్చేందుకు దరఖాస్తు చేసుకున్నాడు. రోజూ కార్యాలయం చుట్టూ తిరుగుతున్నా అధికారులెవరూ సరిగా స్పందించకపోతే గట్టిగా నిలదీశాడు. దీంతో లంచం ఇవ్వనిదే పనిజరగదని పరోక్షంగా చెప్పడంతో డబ్బులేమైనా ఇవ్వాలా అని నేరుగా అడిగాడు. తాహశీల్దార్ సునీత రూ. 5 లక్షలు డిమాండ్ చేస్తున్నట్లు మధ్యవర్తి చెప్పగా.. నేరుగా ఆమెతోనే మాట్లాడి నిజమేనని నిర్ధారించుకున్నాడు.

అంత ఇచ్చుకోలేనని ప్రాధేయపడ్డాడు. చివరకు 3 లక్షలు తీసుకునేందుకు అంగీకరించింది. తొలి విడుత రూ.2 లక్షలు ఇస్తానని చెప్పి ఎమ్మార్వోకు చెప్పగా సరేనంటూ ఒప్పుకుంది. తన పాస్ బుక్ కోసం ఎమ్మార్వో లంచం డబ్బు కోసం వేధింపులపై  బాధిత రైతు హరికృష్ణ ఏసీబీకి ఫిర్యాదు చేశాడు.  ఏసీబీ వారిచ్చిన రూ.2 లక్షలు నగదు  తీసుకుని గురువారం నాడు ఎమ్మార్వో కార్యాలయానికి చేరుకున్నాడు.  రైతు హరికృష్ణ తాను వచ్చిన విషయం చెప్పగా ఎమ్మార్వో సునీత రైతును పిలిపించుకుని లంచం డబ్బులు తీసుకుంది. కార్యాలయంలోనే మాటు వేసిన ఏసీబీ అధికారులు వెంటనే వచ్చి రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు.