హైదరాబాద్ సిటీ, వెలుగు: రైల్వే భద్రతపై దక్షిణ మధ్య రైల్వే ప్రత్యేక దృష్టిపెట్టింది. అందులో భాగంగా 2025–26 ఆర్థిక సంవత్సరంలో జోన్నెట్ వర్క్ వ్యాప్తంగా ‘కవచ్4.0’ రక్షణ వ్యవస్థను ఏర్పాటు చేస్తోంది. దీనికి అనుగుణంగా రైల్వే బోర్డు నిర్దేశించిన 402 రూట్ కిలోమీటర్ల లక్ష్యాన్ని అధిగమించి ఈ జోన్ 479 కిలోమీటర్ల మేర పరీక్షలను విజయవంతంగా పూర్తి చేసిందని అధికారులు తెలిపారు.
పకడ్బందీ ప్రణాళిక, సమర్థవంతమైన పనితీరు ఫలితంగానే ఈ విజయం సాధ్యమైందని తెలిపారు. ఈ జోన్ 479 రూట్ కిలోమీటర్ల 'ఆటోమేటిక్ బ్లాక్ సిగ్నలింగ్' వ్యవస్థను ఇప్పటికే ప్రారంభించింది. ఈ రక్షణ వ్యవస్థ రైల్వే సెక్షన్ సామర్థ్యాన్ని పెంచడంలో సహాయపడుతుందని అధికారులు తెలిపారు.
'కవచ్ 4.0' వ్యవస్థ ఏర్పాటుకు సంబంధించిన క్షేత్ర స్థాయి పరీక్షలు కాజీపేట – పెద్దంపేట (101 రూట్ కిలోమీటర్లు), మల్కాజిగిరి – కామారెడ్డి (106 రూట్ కిలోమీటర్లు), చర్లపల్లి – రఘునాథపల్లి (79 రూట్ కిలోమీటర్లు), గుంతకల్లు – రాయచూరు (120 రూట్ కిలోమీటర్లు), ముద్ఖేడ్ – పర్భణి (81 రూట్ కిలోమీటర్ల) మధ్య ఉన్న రైల్వే సెక్షన్లలో నిర్వహించినట్టు తెలిపారు.
