ఎన్టీఆర్ జిల్లాలో ఘోర బస్సు ప్రమాదం జరిగింది. జిల్లాలోని నందిగామ శివారులో కావేరి ట్రావెల్స్ బస్సు లారీని ఢీకొన్న ఘటనలో పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. మంగళవారం ( నవంబర్ 18 ) అర్థరాత్రి జరిగిన ఈ ఘటనకు సంబంధించి వివరాలిలా ఉన్నాయి.. నందిగామ బైపాస్ అనాసాగరం దగ్గర ఫ్లైఓవర్ పై బస్సు ప్రమాదం జరిగింది. వేగంగా వెళ్తున్న కావేరి ట్రావెల్స్ బస్సు లారీని ఓవర్ టేక్ చేసే క్రమంలో ఎదురుగా వస్తున్న మరో లారీని ఢీకొంది.
ఈ ఘటనలో నలుగురికి తీవ్ర గాయాలవ్వగా.. పలువురికి స్వల్ప గాయాలయ్యాయి. క్షతగాత్రులను నందిగామ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. వీరిలో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది.
బస్సు హైదరాబాద్ నుంచి వైజాగ్ వెళ్తుండగా ప్రమాదం జరిగింది. వేగంగా వచ్చి ఢీకొనడంతో బస్సు ఎడమ భాగం నుజ్జు నుజ్జయ్యింది. ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో 35 మంది ప్రయాణికులు ఉన్నట్లు సమాచారం. అయితే.. ఈ ఘటనలో ఎలాంటి ప్రాణనష్టం జరగకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.
