
- పదేండ్లలో మహిళల సమస్యలపై ఎందుకు పోరాడలే: యశస్వినిరెడ్డి
- కాంగ్రెస్లో చేరిన వరంగల్ డీసీసీబీ చైర్మన్ రవీందర్రావు
హైదరాబాద్, వెలుగు: పదేండ్ల నుంచి జాగృతిని పక్కన పెట్టి, మహిళల సమస్యలను ఎమ్మెల్సీ కవిత పట్టించుకోలేదని పాలకుర్తి ఎమ్మెల్యే యశస్విని రెడ్డి అన్నారు. అధికారం పోగానే ఇపుడు మహిళలతో పాటు అందరి సమస్యలు కవితకు గుర్తుకొస్తున్నాయని ఆమె ఎద్దేవా చేశారు. శనివారం గాంధీ భవన్ లో బీఆర్ఎస్ నేత వరంగల్ డీసీసీబీ చైర్మన్ మర్నేని రవీందర్రావు.. కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్ చార్జ్ దీపాదాస్ మున్షీ, పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్, ఎమ్మెల్సీ మహేశ్ కుమార్ గౌడ్ ఎమ్మెల్యేలు యశస్వినిరెడ్డి, నాగరాజు ఆధ్వర్యంలో కాంగ్రెస్లో చేరారు.
ఆయనతోపాటు వర్ధన్నపేట, పాలకుర్తి నియోజక వర్గాల నుంచి పలువురు బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు కూడా కాంగ్రెస్ లో జాయిన్ అయ్యారు. ఈ సందర్భంగా యశస్విని మాట్లాడారు. కేసీఆర్ కూతురు కవిత ధర్నా చౌక్ వద్ద మహా శివరాత్రి రోజు చేసిన ధర్నా , ఆమె మాట్లాడిన మాటలు హాస్యాస్పదం అన్నారు. వెయ్యి ఎలుకలు తిన్న పిల్లి పుణ్యం కోసం తీర్థయాత్రలకు పోయినట్లు కవిత వైఖరి ఉందని విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే మహిళలకు ప్రాధాన్యం ఇచ్చి గ్యారంటీలను, ఇతర స్కీం లను ఒక్కొక్కటిగా అమలు చేస్తున్నామని చెప్పారు.
సీఎం రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ ప్రభుత్వం మూడు నెలలుగా చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలకు ప్రజల్లో మంచి స్పందన వస్తుందన్నారు. ఇవన్నీ చూసి ఇతర పార్టీల నుంచి పెద్దఎత్తున నేతలు, కార్యకర్తలకు కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారని తెలిపారు. పాత నాయకులు, కొత్త నాయకులు కలిసికట్టుగా పని చేసి పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను గెలిపించాలని కోరారు.