- కాంగ్రెస్ లీడర్లు బై వన్ గెట్‌వన్ మాదిరిగా పదవులు తీసుకున్నరని కామెంట్
పెద్దపల్లి, వెలుగు: ‘డిప్యూటి సీఎం మల్లు భట్టి విక్రమార్క, మంత్రి శ్రీధర్‌బాబు, మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్‌సాగర్‌రావు దోపిడీ దొంగలుగా మారారు. కమీషన్ల పేరుతో అందినకాడికి దోచుకుంటున్నారు’ అని టీఆర్‌ఎస్ అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ఆరోపించారు. బై వన్ గెట్ వన్ కింద కాంగ్రెస్ మంత్రుల కుటుంబసభ్యులకు పదవులు కట్టబెడుతున్నారని విమర్శించారు. రాష్ట్రంలో రైతుల ఆత్మహత్యలు మళ్లీ మొదలయ్యాయని, సభ పెడితే గానీ రైతు భరోసా ఇచ్చే పరిస్థితి కనిపించడం లేదన్నారు.
మంచిర్యాల జిల్లా చెన్నూరు నియోజకవర్గంలో ఇచ్చిన మాదిరిగానే.. పెద్దపల్లి జిల్లా మంథని మండలంలో ఉన్న కాళేశ్వరం ముంపు బాధిత రైతులకు కూడా నష్టపరిహారం ఇవ్వాలని ఆమె డిమాండ్ చేశారు. బాయిబాట కార్యక్రమంలో భాగంగా శుక్రవారం పెద్దపల్లి జిల్లా రామగిరి మండలం ఏఎల్పీ మైన్ వద్ద కార్మికులతో మాట్లాడి వారి సమస్యలు తెలుసుకున్నారు. రామగిరి, పెద్దపల్లిలో టీఆర్‌ఎస్ జెండాలను ఆవిష్కరించారు. అనంతరం పెద్దపల్లి జిల్లా కేంద్రంలో మీడియాతో కవిత మాట్లాడారు. రాష్ట్రంలో ఇసుక, మట్టి దందా విపరీతంగా జరుగుతోందన్నారు.
వడ్ల కొనుగోళ్లు ఇంకా పూర్తి కాలేదని, ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా రైతులు, కల్లాల మీదనే ప్రాణాలు విడుస్తున్నారన్నారు. ఏడు రకాల వడ్లకే బోనస్ ఇస్తామని చెప్పడం సరికాదన్నారు. ఓపెన్ కాస్ట్‌ల కారణంగా ధ్వంసమైన డి86 కాల్వలకు రిపేర్లు చేయించాలని కోరారు. ఈఎస్‌ఐ హాస్పిటల్ కోసం పెద్దపల్లి ఎంపీ ప్రయత్నం చేయాలని కోరారు. పోలీసులతో బాయిబాట కార్యక్రమాన్ని అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారని కవిత ఆరోపించారు. టీఆర్‌ఎస్ బాయిబాట కార్యక్రమం చేపట్టగానే.. బీఆర్‌ఎస్, బీజేపీ నాయకులు కూడా బొగ్గుబాయి కార్మికుల దగ్గరకు వస్తున్నారని విమర్శించారు.
