- కడ్లాపూర్ ఇండస్ట్రియల్పార్క్కు ఇచ్చిన గెజిట్‌ను రద్దు చేయండి
- గవర్నర్‌కు వినతిపత్రం అందించిన కవిత
హైదరాబాద, వెలుగు: రేవంత్‌రెడ్డి ఓ కర్కోటక ముఖ్యమంత్రి అని, రాష్ట్రంలో ఉన్నది దుర్మార్గపు ప్రభుత్వమని తెలంగాణ రక్షణ సేన (టీఆర్ఎస్) చీఫ్ కవిత మండిపడ్డారు. వంద రూపాయల చీర ఇచ్చి ఆడవాళ్లను కోటీశ్వరులను చేస్తున్నామంటూ అబద్ధాలు చెబుతున్నారని మండిపడ్డారు. వెలుగుమట్లలో ఇండ్లు కూలుస్తుంటే ఆ టెన్షన్లో ఓ మహిళకు గర్భస్రావం అయిందని, ఆమె భర్త రోదన ఇప్పటికీ తమకు వినిపిస్తూనే ఉందన్నారు.
మంగళవారం ఆమె లోక్‌భవన్‌లో ధర్మ సమాజ్ పార్టీ అధ్యక్షుడు విశారదన్, బాధితులతో కలిసి గవర్నర్శివప్రతాప్ శుక్లాతో సమావేశమయ్యారు. ఆయా అంశాల్లో బాధితులకు న్యాయం చేయాలని గవర్నర్‌కు వినతిపత్రం ఇచ్చారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. అన్ని అంశాలపైనా రిపోర్ట్ తెప్పించుకుని న్యాయం చేస్తామని గవర్నర్ హామీ ఇచ్చారన్నారు. కల్లాల్లో రైతుల ధాన్యం అలాగే ఉందని, వెంటను కొనుగోలు చేయాలని డిమాండ్‌చేశారు.
వికారాబాద్‌జిల్లా కడ్లాపూర్‌లో159 ఎకరాల భూమిని ప్రభుత్వం బలవంతంగా గుంజుకునే ప్రయత్నాలు చేస్తోందని గవర్నర్‌కు ఇచ్చిన వినతిపత్రంలో కవిత పేర్కొన్నారు. అగ్రవర్ణాల వారి భూములను వదిలేసి ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాలకు చెందిన రైతుల భూములనే తీసుకుంటామని గెజిట్లోనూ పేర్కొన్నారని విమర్శించారు. ఇండస్ట్రియల్ పార్క్ వల్ల కడ్లాపూర్తో పాటు చుట్టుపక్కల గ్రామాలు కాలుష్యం బారిన పడతాయన్నారు.
రీజనల్రింగ్రోడ్అలైన్మెంట్విషయంలో గత బీఆర్ఎస్ ప్రభుత్వం, ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం పారదర్శకంగా వ్యవహరించలేదని కవిత ఆరోపించారు. అలైన్మెంట్ల మార్పులతో పెద్దల భూములను భూసేకరణ నుంచి తప్పించి పేదల భూములనే తీసుకుంటున్నట్టుగా ఫిర్యాదులున్నాయన్నారు. రీజినల్ రింగ్‌రోడ్డులో జరిగిన అక్రమాలపై విచారణ జరిపించాలని గవర్నర్‌ను కోరారు. వెలుగుమట్లలో భూదాన్ భూముల్లో నివసిస్తున్న పేదల ఇండ్లను కూల్చేసి వారిని నిర్వాసితులుగా మార్చేసిందని మండిపడ్డారు.
దీంతో 739 కుటుంబాలు రోడ్డునపడ్డాయన్నారు. అందులో కేవలం 311 కుటుంబాలకే 75 గజాల చొప్పున స్థలం కేటాయించి పట్టాలు ఇచ్చిందని, మరో 418 కుటుంబాలకు ఇప్పటివరకు ఎలాంటి సాయం చేయలేదన్నారు.
