
- వాటాల పంపకాల్లో తేడాల వల్లనే కవిత రాద్ధాంతం
- హరీశ్, సంతోష్ వెనుక ఉండాల్సిన ఖర్మ మాకేంటి?
- మేము ప్రజల వెంట ఉన్నామని వెల్లడి
హైదరాబాద్, వెలుగు: కవిత.. కేసీఆర్ విడిచిన బాణం అని పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్‌గౌడ్ అన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు విచారణ నుంచి ప్రజల దృష్టిని మళ్లించేందుకే కేసీఆర్ కుటుంబం కొత్త నాటకం ఆడుతోందని ఆయన ధ్వజమెత్తారు. బుధవారం (సెప్టెంబర్ 03) ఆయన హైదరాబాద్ లో మీడియాతో మాట్లాడారు.
పదేండ్లపాటు బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు ప్రభుత్వం తీసుకున్న కీలక నిర్ణయాల్లో ఆమె ఒకరని, అలాంటిది కవిత ప్రమేయం లేకుండా కాళేశ్వరం అవినీతి జరిగిందా? అని ఆయన ప్రశ్నించారు. దోచుకొని.. దాచుకొని.. ఇప్పుడు నీతి వ్యాఖ్యలు మాట్లాడడం విచారకరమన్నారు. ఐదేండ్ల ముందే కవిత రాజీనామా చేసుంటే ప్రజలు ఆమెను నమ్మేవారని అన్నారు.
వాటాల పంపకాల్లో తేడాల వల్లనే కవిత ఈ రాద్ధాంతం చేస్తున్నారని ఆయన ఆరోపించారు. ‘‘హరీశ్ రావు, సంతోష్ వెనుక ఉండాల్సిన ఖర్మ మాకేంటి. మేము ప్రజల వెంట ఉన్నాం”అని మహేశ్గౌడ్స్పష్టం చేశారు. అవినీతిపరుల విషయంలో తలదూర్చమని, అలాంటి వారందరినీ ఒకే కోణంలో చూస్తామన్నారు. సీఎం రేవంత్ రెడ్డిపై కవిత అనవసరమైన ఆరోపణలు చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. ‘‘కవిత అమెరికా నుంచి రాగానే ఆమె పంథాను ఎందుకు మార్చుకున్నారు. మొదట కేటీఆర్ పై ఎక్కుపెట్టిన బాణం ఆ తర్వాత హరీశ్ పైకి ఎలా మళ్లింది’’అని మహేశ్గౌడ్ప్రశ్నించారు.