ఆనాటి ప్రభుత్వ పాపంలో నాకూ భాగం ఉంది.. క్షమించండి : తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత

ఆనాటి ప్రభుత్వ పాపంలో నాకూ భాగం ఉంది.. క్షమించండి : తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత
  •     బీఆర్‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌ సర్కార్‌‌‌‌‌‌‌‌ హయాంలో ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు న్యాయం చేయలేకపోయా: కవిత
  •     హాఫ్ మిలియన్ మార్చ్ చేస్తేనే ఉద్యోగుల సమస్యలు తీరుతయ్‌‌‌‌
  •     ధర్నా చౌక్‌‌‌‌లో ఔట్‌‌‌‌ సోర్సింగ్‌‌‌‌ ఉద్యోగుల ఆందోళనకు మద్దతు

ముషీరాబాద్, వెలుగు: గత బీఆర్ఎస్ ప్రభుత్వ పాలనలో ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు న్యాయం చేయలేకపోయానని, ఈ విషయంలో తనను క్షమించాలని ఉద్యోగులను తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత కోరారు. ఆనాటి ప్రభుత్వ పాపంలో తనకు భాగం ఉందని పేర్కొన్నారు. గత ప్రభుత్వం సమస్యలు పరిష్కరించకుండా.. ఉన్న ధర్నా చౌక్‌‌‌‌ను ఎత్తేస్తే.. ఈ ప్రభుత్వం ధర్నాలు చేసుకొని, చావండి.. అన్నట్టుగా వ్యవహరిస్తోందని ఫైర్ అయ్యారు. హాఫ్ మిలియన్ మార్చ్ చేస్తే ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల సమస్యలు పరిష్కారమవుతాయని సూచించారు. ఉద్యోగుల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ ఔట్‌‌‌‌ సోర్సింగ్ ఎంప్లాయీస్ జేఏసీ కమిటీ ఆధ్వర్యంలో హైదరాబాద్‌‌‌‌లోని ఇందిరా పార్క్ ధర్నా చౌక్‌‌‌‌లో ఆదివారం ధర్నా చేపట్టారు. 

ఈ సందర్భంగా కవిత మాట్లాడుతూ.. తెలంగాణ వస్తే ఔట్‌‌‌‌ సోర్సింగ్, కాంట్రాక్ట్ ఉద్యోగుల వ్యవస్థ ఉండదని భావించామని, అయితే రాష్ట్ర ఆవిర్భావం తర్వాత పర్మినెంట్ ఉద్యోగాలనే ఔట్‌‌‌‌ సోర్సింగ్‌‌‌‌గా మార్చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. ఆనాటి ప్రభుత్వం ఔట్‌‌‌‌సోర్సింగ్ ఉద్యోగులను పట్టించుకోలేదని అందులో భాగస్వామిగా ఉండి మీ సమస్యలకు న్యాయం చేయలేకపోయానని చెప్పారు. కాంగ్రెస్‌‌‌‌ను గెలిపిస్తే వాళ్లు కూడా ఈ సమస్యను పక్కకు పెట్టారని విమర్శించారు. ప్రభుత్వంపై రూపాయి భారం పడకుండా సమస్య తీర్చే అవకాశం ఉన్నా.. పట్టించుకోవడం లేదన్నారు. 

మరో మిలియన్ మార్చ్..

ఈ ప్రభుత్వం ఏజెన్సీలకు కొమ్ముకాస్తూ 5 లక్షల ఔట్‌‌‌‌ సోర్సింగ్, కాంట్రాక్టు ఉద్యోగులకు అన్యాయం చేస్తోందని కవిత ఆరోపించారు. ప్రొఫెసర్లు కోదండరాం, హరగోపాల్ లాంటి మేధావుల మౌనం వీరికి శాపంగా మారిందని విమర్శించారు. వెంటనే రాష్ట్ర ప్రభుత్వం ఔట్‌‌‌‌ సోర్సింగ్ ఉద్యోగుల కోసం కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. ఔట్‌‌‌‌ సోర్సింగ్, కాంట్రాక్టు ఉద్యోగులు చేపట్టిన ఈ ఉద్యమం మరో తెలంగాణ ఉద్యమంలా ఉందన్నారు. 

తెలంగాణ ఉద్యమంలో మిలియన్ మార్చ్ ఏ విధంగా చేశామో అలాగే ఉద్యోగులు హైదరాబాద్ వీధుల్లో మార్చ్ చేపట్టాలని, అప్పుడే ఈ ప్రభుత్వం స్పందిస్తుందని చెప్పారు. ఉద్యోగులకు అందాల్సిన ప్రయోజనాలను రాష్ట్ర ప్రభుత్వం ఏజెన్సీలకు దోచిపెడ్తుందని ఆరోపించారు. సమస్యలపై పోరాటం మాత్రమే కాకుండా, పరిష్కారం అయ్యేంత వరకు కొట్లాడం తెలంగాణ బిడ్డల లక్ష్యమన్నారు. తాము త్వరలోనే రాజకీయ పార్టీగా అవతరించబోతున్నామని, ఈలోపే ఔట్‌‌‌‌ సోర్సింగ్ ఉద్యోగుల సమస్యలకు పరిష్కారం దొరుకుతుందని భావిస్తున్నానన్నారు. 

తాము అధికారంలోకి వస్తే ఔట్‌‌‌‌ సోర్సింగ్, కాంట్రాక్ట్‌‌‌‌ అనే విధానాన్ని లేకుండా చేస్తామని హామీ ఇచ్చారు. ప్రభుత్వ ఫలాలను ప్రజలకు అందించేందుకు ప్రభుత్వ ఉద్యోగుల వ్యవస్థ మాత్రమే ఉండాలనేది తమ విధానమని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ అంజిరెడ్డి, మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి, బీసీ, ఎస్సీ, ఎస్టీ రాజ్యాధికార జేఏసీ కన్వీనర్‌‌‌‌‌‌‌‌ విశారదన్ మహరాజ్, బీసీ సంక్షేమ శాఖ జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్, బీసీ జేఏసీ కన్వీనర్ గుజ్జ కృష్ణ, తెలంగాణ ఆదివాసి జాగృతి రాష్ట్ర అధ్యక్షుడు లోకిని రాజు, ఔట్‌‌‌‌ సోర్సింగ్ ఉద్యోగులు పాల్గొన్నారు.