కవిత అరెస్ట్ అక్రమం.. ఢిల్లీ హైకోర్టులో ఆమె తరఫు అడ్వకేట్ వాదనలు

కవిత అరెస్ట్ అక్రమం.. ఢిల్లీ హైకోర్టులో ఆమె తరఫు అడ్వకేట్ వాదనలు
  •     అప్రూవర్ల స్టేట్​మెంట్ల ఆధారంగా అదుపులోకి తీసుకున్నరు
  •     విచారణకు సహకరించినా అరెస్ట్ చేసిన్రు
  •     బెయిల్ మంజూరు చేయాలని విజ్ఞప్తి
  •     నేడు ఈడీ, సీబీఐ తరఫు అడ్వకేట్ల వాదనలు

న్యూఢిల్లీ, వెలుగు : ఢిల్లీ లిక్కర్ స్కామ్ వ్యవహారంలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితను దర్యాప్తు సంస్థలు అక్రమంగా అరెస్ట్ చేశాయని ఆమె తరఫు సీనియర్ అడ్వకేట్ విక్రమ్ చౌదరి ఢిల్లీ హైకోర్టులో వాదించారు. అప్రూవర్లు ఇచ్చిన స్టేట్​మెంట్ల ఆధారంగా తన క్లయింట్​పై కేసు పెట్టి అదుపులోకి తీసుకున్నారని తెలిపారు. కవితకు వ్యతిరేకంగా వాంగ్మూలాలు ఇచ్చిన నిందితులందరికీ ఈ కేసులో బెయిల్ వచ్చిందని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు.

 లిక్కర్ స్కామ్​లో ఈడీ, సీబీఐ కేసుల్లో బెయిల్ మంజూరు, కవిత అరెస్ట్​కు సీబీఐకి ట్రయల్ కోర్టు అనుమతి, కస్టడీ ఇవ్వడాన్ని సవాల్ చేస్తూ ఢిల్లీ హైకోర్టులో ఆమె వేర్వేరుగా పిటిషన్లు దాఖలు చేశారు. ఈ పిటిషన్లపై సోమవారం జస్టిస్ స్వర్ణకాంత శర్మ విచారణ జరిపారు. అడ్వకేట్ విక్రమ్ చౌదరి వాదనలు వినిపిస్తూ.. ‘‘విచారణలో భాగంగా సీబీఐ, ఈడీకి సహకరించినా.. కవితను అక్రమంగా అరెస్ట్ చేశారు. ఇదే కేసులో నిందితులుగా ఉన్న శరత్ చంద్రారెడ్డి, మాగుంట రాఘవ రెడ్డికి బెయిల్ వచ్చింది’’అని కోర్టుకు వివరించారు. 

డిజిటల్ ఆధారాలు ధ్వంసం చేసిన్రు

‘‘సెల్​ఫోన్లు, డిజిటల్ ఆధారాలను అధికారులు ధ్వంసం చేశారు. మహిళలను విచారించే విషయంలో స్పష్టత కోసం సీఆర్పీసీలోని అంశాలను లేవనెత్తుతూ సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేశాం. కవితపై చర్యలు తీసుకోబోమని విచారణ సందర్భంగా ఈడీ అండర్ టేకింగ్ కూడా ఇచ్చింది. సుప్రీం కోర్టులో కేసు పెండింగ్​లో ఉండగానే.. కవితకు ఈడీ సమన్లు జారీ చేసింది’’అని కోర్టుకు వివరించారు. అన్ని వివరాలు పరిశీలించి బెయిల్ మంజూరు చేయాలన్నారు. 

సీబీఐ చట్టవిరుద్ధంగా వ్యవహరించింది

జ్యుడీషియల్ కస్టడీలో ఉన్న కవిత విచారణ, అరెస్ట్​కు సంబంధించి సీబీఐ చట్టవిరుద్ధంగా వ్యవహరించిందని విక్రమ్ చౌదరి వాదించారు. కవితను ప్రశ్నించాలంటూ సీబీఐ ఏప్రిల్ ఫస్ట్ వీక్​లో ట్రయల్ కోర్టులో పిటిషన్ వేసిందన్నారు. అయితే, సీఆర్పీసీ నిబంధనల ప్రకారం.. సీబీఐ ప్రశ్నించాలంటే కవిత వాదన కూడా పరిగణనలోకి తీసుకోవాల్సి ఉంటుందన్నారు. ఇవేమీ లేకుండా ట్రయల్​ కోర్టు కవితను విచారించేందుకు సీబీఐకి అనుమతి ఇచ్చిందన్నారు. 

ఈడీ, సీబీఐ వాదనల తర్వాత తీర్పు రిజర్వ్

కవిత తరఫు అడ్వకేట్ విక్రమ్ చౌదరి వాదనలు కంప్లీట్ అయ్యాక.. ‘‘మీ వాదనలు వినిపించేందుకు సిద్ధంగా ఉన్నారా?’’అని జస్టిస్ స్వర్ణకాంత శర్మ ఈడీ, సీబీఐ అడ్వకేట్లను ప్రశ్నించారు. తాము మంగళవారమే వాదనలు వినిపిస్తామని బదులిచ్చారు. దీంతో మధ్యాహ్నం 12 గంటల నుంచి 1.15 వరకు ఈడీ, సీబీఐ అడ్వకేట్లు వాదనలు వినిపించేందుకు కోర్టు టైమ్ కేటాయించింది. కాగా, ఆయన వాదనలు కంప్లీట్ అయ్యాక.. జస్టిస్ స్వర్ణకాంత శర్మ స్పందిస్తూ.. ఈడీ, సీబీఐ వాదనలు ముగిశాక తీర్పును రిజర్వ్ చేస్తామని పేర్కొన్నారు.