- 2013 భూ సేకరణ చట్టం ప్రకారం పరిహారం అందించలే.. బిల్లులు చెల్లించలే: కవిత
- మాజీ మంత్రి జగదీశ్‌రెడ్డి మాట తప్పిండు
- వారి వల్లే డిండి ఇరిగేషన్ ప్రాజెక్టు లేట్
- ప్రాజెక్టు పూర్తయితే వేలాది మందికి లాభం జరిగి ఉండేది
- నిర్వాసితులకు న్యాయం జరిగేలా సర్కారుతో చర్చిస్తా
- ‘జాగృతి జనం బాట’ కార్యక్రమంలో భాగంగా నల్గొండ జిల్లాలో పర్యటన
- డిండి, నక్కలగండి, నెల్లికల్ ప్రాజెక్టు పనుల పరిశీలన
నాంపల్లి/దేవరకొండ/హాలియా, వెలుగు: భూ నిర్వాసితులను గత బీఆర్ఎస్ సర్కారు పట్టించుకోలేదని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కవిత అన్నారు. 2013 భూసేకరణ చట్టం ప్రకారం నిర్వాసితులకు పరిహారం అందించలేదని మండిపడ్డారు. మునుగోడు ఉపఎన్నిక సమయంలో మాజీ మంత్రి జగదీశ్ రెడ్డి ఇచ్చిన హామీ కూడా నెరవేర్చలేదని తెలిపారు. నల్గొండ జిల్లాలోని డిండి ఎత్తిపోతల పథకం నిర్మాణంలో భూములు, ఇండ్లు కోల్పోయిన భూ నిర్వాసితులకు.. భూసేకరణ చట్టం ప్రకారం అన్ని సౌకర్యాలను కల్పించేలా ప్రభుత్వంతో చర్చిస్తానని హామీ ఇచ్చారు. ‘జాగృతి జనం బాట’ కార్యక్రమంలో భాగంగా మంగళవారం కవిత నల్గొండ జిల్లాలో పర్యటించారు.
తన అనుచరులతో కలిసి డిండి ఎత్తిపోతల పథకం పరిధిలోని నాంపల్లి మండలం, కిష్టారంపల్లి ప్రాజెక్టు వద్ద భూ నిర్వాసితులతో మాట్లాడారు. డిండి లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు పూర్తయితే వేలాది మందికి లాభం జరిగి ఉండేదని అన్నారు. ఈ ప్రాంత ప్రజలు పెద్ద మనసుతో భూములిచ్చారని, కానీ ప్రాజెక్టు నిర్మాణం 11 ఏండ్లు ఆలస్యం కావడంతో వారికి న్యాయం జరగలేదని చెప్పారు. నిర్వాసితులకు ఇండ్లు, కాలనీలు కట్టించలేదని అన్నారు. ప్రజలను వారికి కట్టించిన ఇండ్లలో దిగబెట్టేవరకూ నెలనెలా భత్యం ఇవ్వాలని చట్టంలో ఉందన్నారు. కాంట్రాక్టర్లకూ బిల్లులు చెల్లించకపోవడంతో పనులు ఆగిపోయాయని చెప్పారు. ఇంకా ఆలస్యం చేస్తే రైతులే కూలీలుగా మారిపోతారని అన్నారు.
పంతం పట్టి అడిగితేనే పనులు అవుతాయని, అందుకే తాను ఇక్కడికి వచ్చానని చెప్పారు. మరోసారి సమావేశం ఏర్పాటు చేసి.. సమస్యల పరిష్కారం కోసం కార్యాచరణ రూపొందించుకొని ముందుకు తీసుకువెళ్తానని తెలిపారు. అనంతరం ఆమె ప్రాజెక్టు కట్టపైకి ఎక్కి పనుల పురోగతిని పరిశీలించారు.
గత, ప్రస్తుత ప్రభుత్వాల నిర్లక్ష్యం.. తండావాసులకు శాపం
నక్కలగండి ప్రాజెక్ట్ నిర్మాణంలో గత, ప్రస్తుత ప్రభుత్వాల నిర్లక్ష్యమే తండావాసులకు శాపంగా మారిందని కవిత ఆరోపించారు. ప్రాజెక్టు కింద సర్వం కోల్పోతున్న చందంపేట మండలం మోత్యా తండా, నక్కలగండి తండా, అచ్చంపేట మండలం పరిధిలోని మార్లపాడు తండాలకు ఆర్ అండ్ ఆర్ పునరావాసం కల్పించాలని డిమాండ్ చేశారు. సర్వం కోల్పోతున్న రైతులకు ప్రస్తుత మార్కెట్ ధర ప్రకారం నష్టపరిహారం ఇవ్వాలని అన్నారు. దేవరకొండ మండల పరిధిలోని కొమ్మేపల్లి గిరిజన ఆశ్రమ పాఠశాల, చందంపేట మండల పరిధిలోని నక్కలగండి ప్రాజెక్టును ఆమె సందర్శించారు.
పాఠశాల విద్యార్థులతోపాటు నక్కలగండి ప్రాజెక్టు బాధిత తండావాసులతో మాట్లాడారు. ఎస్ఎల్బీసీ, నక్కలగండి ప్రాజెక్టును ఎప్పుడు పూర్తి చేసి ఉపయోగంలోకి తీసుకొస్తారో చెప్పాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ప్రాజెక్టులో కోల్పోయిన భూములకు నష్టపరిహారం ఇచ్చేంతవరకూ ఇక్కడి రైతులకు రైతు బంధు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ విషయంపై చర్చించేందుకు సీఎం రేవంత్‌రెడ్డి వద్దకు తీసుకెళ్తానని తండావాసులకు హామీ ఇచ్చారు. కాగా, గత బీఆర్ఎస్ సర్కారు హయాంలో ప్రారంభించిన నెల్లికల్ లిఫ్ట్ పథకం ఇప్పటివరకూ పూర్తి కాలేదని కవిత అన్నారు. కనీసం ఈ ప్రభుత్వమైనా వెంటనే పనులు పూర్తిచేసేలా చర్యలు తీసుకోవాలని కోరారు. నెల్లికల్ లిఫ్ట్ స్కీమ్ పనులను ఆమె పరిశీలించారు. ఈ పథకం పూర్తికాకపోవడంతో కృష్ణానది పక్కనే ఉన్నా నాగార్జునసాగర్ సమీపంలో ఉన్న భూములకు ఇప్పటికీ సాగునీరు అందడం లేదని మండిపడ్డారు.
